జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ గురించే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్వల్ప వ్యవధిలోనే మరోసారి పవన్ ఢిల్లీకి వెళ్లనుండటం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణాలు ఏమిటి...? రాజధాని మార్పు ఉండదని పవన్ చెప్పిన మాటలు నిజమవుతాయా...? పవన్ బీజేపీ నేతలతో ఏయే అంశాల గురించి చర్చించనున్నాడు...? అనే విషయాలపై బీజేపీ జనసేన కార్యాచరణ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. 
 
బీజేపీ, జనసేన పార్టీలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుటున్నాయి. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఇరు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ జనసేన పార్టీలు కలిసి అక్కడే ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నారని తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణ, రాజధాని మార్పు, పొత్తుకు సంబంధించిన కీలక విషయాలపై బీజేపీ పార్టీ కీలక నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. 
 
ఏపీని రాజధాని అంశం ప్రస్తుతం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లులు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల నిర్ణయాన్ని రాజధాని గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని రైతులు అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చటమే తన లక్ష్యమని చెప్పిన పవన్ బీజేపీతో కలిసి ఎలా ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. 
 
పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదని ఇప్పటికే స్పష్టం చేయటంతో రాజధానుల విషయంలో బీజేపీ జనసేన పార్టీలు కలిసి ఎలా ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. పవన్ ఇప్పటివరకూ ఎవరి అపాయింట్మెంట్ తీసుకోలేదని ఢిల్లీకి వెళ్లిన తరువాత పవన్ అపాయింట్మెంట్ తీసుకోనున్నాడని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: