నెల రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్న రాజధాని అంశం ఇప్పుడు మరో కీలక మలుపు తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును కౌన్సిల్ లో పాస్ చేసుకోలేకపోయిన అధికార పక్షానికి ఈ విషయం మింగుడుపడడం లేదు. బలం తక్కువగా ఉన్నా మండటిలో బిల్లు పాస్ చేయించుకోవాలని చూసిన అధికార పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సీఎం జగన్ వాయిదాలు లేకుండా ఎలాగైనా బిల్లు నెగ్గించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు మండలిని రద్దు చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. ఈ అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

 

మండలి రద్దు అనేది గతంలో దివంగత ఎన్టీఆర్ కూడా తీసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లలో ఎప్పుడూ మండలి రద్దు జరగలేదు. తాజా రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా జగన్  నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తలు జాతీయస్థాయిలో చర్చనీయాంశం కానుంది. కౌన్సిల్ లో టీడీపీ వ్యవహరించిన తీరుపై జగన్ ఇప్పటికే సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై న్యాయనిపుణులు, సీనియర్ పార్టీ నేతలతో సమావేశమైన జగన్ మండలి రద్దు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రభుత్వానికి జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని మంత్రుల సమావేశంలోనూ చర్చించినట్టు తెలుస్తోంది. మండలి రద్దుపై ఇప్పటికే అధికారులతో కూడా జగన్ మాట్లాడినట్లు వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి

 

 

ఏపీ మంత్రివర్గం దీనిపై అత్యవసరంగా సమావేశం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. మంత్రులు కూడా ఎక్కువమంది మండలి రద్దుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను మంగళవారం వరకూ పొడిగించారు. ఇరు పార్టీలు కౌన్సిల్ లో జరిగిన అంశాలపై చర్చిస్తున్నాయి. చైర్మన్ ను చంద్రబాబు ప్రభావితం చేసారని వైసీపీ.. నిబంధనల మేరకే నడుచుకున్నారని టీడీపీ.. ఇలా రెండు పార్టీల నాయకులు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: