నిర్భయ దోషులకు ఉరి ఖరారైంది. ఫిబ్రవరి ఒకటో తారీఖు ఉరి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జైలు అధికారులు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇలా ఉరి తీసే ముందు దోషులను చివరి కోరిక అడగుతారు. సాధ్యమైతే ఆ చివరి కోరిక తీరుస్తారు. అలా చేస్తే వారు ప్రశాంతంగా మరణిస్తారని ఓ నమ్మకం. చాలా మంది తమ చివరి కోరికగా.. తమవాళ్లను చూడాలని.. లేకపోతే.. ఏదైనా తినాలని.. లేదా.. వాళ్లకు ఇష్టమైన కోరిక కోరుకుంటారు.

 

నిర్భయ దోషులకు ఒకటో తారీఖు ఉరి సిద్ధమవుతున్న నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు వారిని చివరి కోరిక ఏంటని అడిగారట. అయితే విచిత్రంగా ఈ నలుగురు దోషులూ ఎలాంటి సమాధానం చెప్పలేదట. అధికారుల ప్రశ్నలకు వారు మౌనంగా ఉండిపోయారట. ఈ విషయాన్ని తీహార్ జైలు వర్గాలు చెబుతున్నాయి. అయితే వారు మౌనంగా ఉన్నది జీవితంపై వైరాగ్యంతో అన్నట్టుగా అనిపించడంలేదట.

 

ఇప్పటికీ ఫిబ్రవరి ఒకటో తారీఖున తమ ఉరి ఉంటుందని వారు నమ్మడం లేదట. ఎలాగైనా ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందని ఆ నలుగురు దోషులు ధీమాగా ఉన్నట్లు కన్పిస్తోందని జైలు వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి వారిని బుధవారమే ఉరితీయాల్సి ఉంది. ఐతే.. క్షమాభిక్ష అభ్యర్థన రూపంలో ఆటంకం ఏర్పడింది.

 

నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. దీంతో వీరి శిక్ష అమలు తేదీ వాయిదా పడింది. ఇటీవల ఆ అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంతో డిల్లీ కోర్టు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. దోషులను ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు ఉరితీయాలని అధికారులను ఆదేశించింది. ఆ దోషులు మాత్రం మళ్లీ ఉరి వాయిదా పడుతుందన్న దీమాతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: