ఆయన దేశంలోనే ప్రముఖ లాయరు. ప్రత్యేకించి పొలిటికల్ కేసుల్లో దిట్ట. ఆయన ఫీజు గంటకు కోటి రూపాయల పైమాటే ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన కేసులు వాదిస్తారు. ఆయన కేసు పట్టుకున్నాడంటే.. విజయం సాధించాల్సిందే. అందుకే దేశంలోని ప్రముఖులంతా ఆయన వైపే చూస్తారు. ఆయనే ముకుల్ రోహిత్గీ. ఇప్పుడు అలాంటి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

 

ఎందుకంటే.. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదానికి శాసనమండలిలో ఎదురుదెబ్బ తగిలింది కదా. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి.. ఈ బిల్లులను సత్వరం ఆమోదించుకోవాలంటే ఎలాంటి వ్యూహం ఉండాలి.. మండలిని రద్దు చేసేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి అంశాలపై చర్చించడానికి ఆయన్ను ప్రత్యేకంగా పిలిపించినట్టు తెలుస్తుంది.

 

బిల్లుల ఆమోదంపై ఏం చేద్దామనే విషయమై పార్టీ ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతో సీఎం జగన్ మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం, పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సుమారు గంట పాటు చర్చించారట.

 

మరోవైపు.. రాజధాని రైతులు వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు రాబోతోంది. అందుకే ఈ చిక్కుముడులు అన్నింటిని ఎలా పరిష్కరించాలన్న విషయమై జగన్ ముకుల్ రోహిత్గీ సలహాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైఖరిని సీఎం సవివరంగా తెలియజేసిన జగన్ తగిన వ్యూహం కోసం ముకుల్ తో సుదీర్ఘంగా చర్చించారట. ఎట్టి పరిస్ధితుల్లోనూ రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టాలని జగన్ పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కౌన్సిల్ లో మెజారిటీ లేకపోవడం జగన్ కు పెద్ద సంకటంగా మారింది. మరి ఈ సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ జగన్ కు ఎలాంటి వ్యూహం సూచిస్తాడో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: