ఏపీ శాసన మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉంది. ఆ ఆధిక్యాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు జగన్ ను ఇబ్బంది పెడుతున్నారు. 3 రాజధానుల బిల్లును మండలిలో అడ్డుకున్నారు. తన వ్యూహం ఫలించిందని చంద్రబాబు సంబరపడ్డారు. కానీ ఇదే సమయంలో జగన్ చంద్రబాబు నెత్తిన మరో పిడుగు వేశారు. అసలు మండలినే రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు.

 

సాక్షాత్తూ ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మండలి రద్దు ఖాయమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అసలు జగన్ అసెంబ్లీలో మండలి గురించి ఏమన్నారో చూద్దాం..

 

శాసన మండలిలో జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయి. మండలి చట్టసభలో భాగమైనందున చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం.. కానీ తనతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మండలిలో జరిగిన తంతును అందరమూ చూశాం. గ్యాలరీల్లో తెదేపా అధినేత చంద్రబాబు కూర్చొని జారీ చేసిన ఆదేశాలు చూస్తే మండలి ఛైర్మన్‌ నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని సభ చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

 

" ఉన్నత విద్య చదివిన వ్యక్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, విశ్రాంత అఖిల భారత సర్వీసు అధికారులు శాసనసభలో ఉన్నారు. ఇంత మందిని ఉంచుకుని శాసన మండలిని కొనసాగించటంలో ఔచిత్యం లేదు. ‘మండలి కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నాం. “

 

" పేదరికంలో ఉన్న రాష్ట్రంలో మండలి కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? అన్నది మా ప్రశ్న. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మండలిని కొనసాగించాల్సిన అవసరముందా? అనే ఆలోచన కూడా ఉత్పన్నమవుతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న మండలి ఇక కొనసాగటం ఎందుకన్న భావన అందరిలోనూ ఉంది. “ జగన్ ను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తే.. జగన్ అసలు మండలినే ఎత్తేసి బాబుకు మరో షాక్ ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: