హైదరాబాద్ లోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఉన్న మమత వృద్ధాశ్రమంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక సంస్థ మానసిక పునరావాస కేంద్రాన్ని వృద్ధాశ్రమం పేరుతో నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అపరిశుభ్ర వాతావరణంలో మానసిక వికలాంగుల కేంద్రాన్ని కొనసాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానికులు పోలీసులకు ఆశ్రమం నిర్వాహకులు వికలాంగులకు కర్రలతో కొడుతున్నట్టు చెప్పారు.                                    
 
73 మంది మానసిక వికాలాంగులను ఇరుకు గదుల్లో ఉంచి ఆశ్రమ నిర్వాహకులు చిత్ర హింసలకు గురి చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మమత వృద్ధాశ్రమంపై దాడులు చేసి ఆశ్రమంలో ఉన్న బాధితుల వివరాలను తెలుసుకోగా పోలీసులే షాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మమత వృద్ధాశ్రమ నిర్వాహకులు మానసిక సమస్యలతో బాధపడేవారిని బాగు చేస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. 
 
గొలుసులతో కట్టేసి నిత్యం ఆశ్రమంలో ఉండేవారికి నరకం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు వైద్య పరీక్షల కొరకు బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఒక్కో మానసిక వికలాంగుడి కుటుంబ సభ్యుల నుండి నెలకు 5 వేల రూపాయల నుండి 10,000 రూపాయలు నిర్వాహకులు వసూలు చేస్తున్నారని వారికి సరైన సదుపాయాలు కల్పించకపోగా కర్రలతో కొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కీసర పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా మానసిక వికలాంగుల కేంద్రం నిర్వహిస్తున్న వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.  తమకు సరైన వైద్య సదుపాయాలు కూడా కల్పించటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విచారణ జరిపిన అనంతరం మమత వృద్ధాశ్రమాన్ని మూసివేశారు. నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: