పేదల ఇళ్ల స్థలాల కోసం విశాఖలో ల్యాండ్ పూలింగ్ చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు ఆరు వేల ఎకరాల భూములు గుర్తించింది. అత్యధికంగా అనకాపల్లి మండలంలో 14 వందల 52.87ఎకరాలను సమీకరించనున్నారు. భీమునిపట్నంలో 486 ఎకరాలు, పద్మనాభం మండలంలో 515 ఎకరాలు గుర్తించారు. సబ్బవరం మండలంలో 13 వందల 73.87 ఎకరాలు, ఆనందపురం మండలంలో 11 వందల4.40 ఎకరాలు సమీకరిస్తారు.

 

ఇంకా పరవాడలో 343 ఎకరాలు, గాజువాకలో 88 ఎకరాలు, పెదగంట్యాడలో 159 ఎకరాలు తీసుకుంటారట. విశాఖ గ్రామీణంలో అతి తక్కువగా కేవలం 96.40 ఎకరాల భూమిని సమీకరిస్తారట. అయితే.. ఇక్కడే వస్తోంది అసలు చిక్కు.. మొత్తం సేకరించాల్సిన భూమిలో2552 ఎకరాలు అసైన్డ్ భూములు. పీఓటీ భూమి 464.60 ఎకరాలు. ఇప్పటికే ఆక్రమణలలో ఉన్న భూమి 2 వేల 343 ఎకరాలు, ఇవి కాకుండా ఖాళీ భూమి 755 ఎకరాలు. ఈ వివరాలు సమీకరణ ఉత్తర్వుల్లోనే ఉన్నాయి.

 

మొత్తంగా విశాఖ జిల్లాలో 6 వేల 116 ఎకరాలను సమీకరించాలన్నది జగన్ సర్కారు ఆలోచన. అయితే ఇప్పటికే ఈ భూముల్లో ఆక్రమణల్లో ఉన్నవారు.. ఈ భూసమీకరణకు ముందుకొస్తారా అన్నది అసలు ప్రశ్న ఎందుకంటే.. ఈ పూలింగ్ ద్వారా ఇప్పటికే ఈ భూముల్లో ఉన్నవారికి.. అసైన్డ్ భూములకు ఎకరాకు 900 గజాలు, పదేళ్లకు పైగా ఆక్రమణలో ఉంటే 450 గజాలు... ఐదు నుంచి పదేళ్ల లోపు ఆక్రమణలో ఉన్న భూమికి 250 గజాలు చొప్పున తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం విధి విధానాల్లో పేర్కొంది.

 

మరి ఇప్పటికే ఈ భూముల్లో ఉన్నవారు.. ఈ తక్కువ భూమి తీసుకునేందుకు ఒప్పుకుంటారా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఈ ల్యాండ్ పూలింగ్ విషయంలో అటూ ఇటూ జరిగితే అల్లరి చేసేందుకు విపక్షాలు, ఎల్లో మీడియా కాచుకుని కూర్చున్నాయి. అందుకే ఈ విషయంలో జగన్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయకపోతే.. అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: