జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఎందరో దేశం కొరకు బలిదానాలు చేశారని దేశం కోసం బలిదానం చేసిన వారి త్యాగాలు, లక్ష్యాలను నెరవేర్చటానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన హారతి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అష్టావదాని గరికపాటి నరసింహారావు హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. భారతమాత వేషధారణలో చాలామంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ దేశానికి బలమైన నాయకత్వం కావాలని మోదీతో అది సాధ్యమైందని చెప్పారు. 
 
దేశానికి సేవ చేయాలనే తపనతో మాత్రమే తాను బీజేపీలో చేరానని దేశ సేవలో కర్పూరంలా కరిగిపోవాలని తనకు ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. హిందువులను ఊచకోత కోసే సెక్యులరిజం మనకు అవసరం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో, తపనతో మాత్రమే తాను బీజేపీ పార్టీతో కలిసినట్లు చెప్పారు. పాకిస్థాన్ లో ఉన్న హిందువులకు రక్షణ లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మరోవైపు పవన్ కళ్యాణ్ కు ఏపీ రాజధాని అమరావతిలో 62 ఎకరాల భూమి ఉన్నట్టు గత కొన్ని రోజుల నుండి వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతూ ఉండటంతో జనసేన పార్టీ ఈ వార్తల గురించి స్పష్టత ఇచ్చింది. జనసేన పార్టీ న్యాయ విభాగం కోఆర్డినేటర్ సాంబ శివ ప్రతాప్ అమరావతి ప్రాంతంలో పవన్ కు 62 ఎకరాల భూమి ఉన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో వక్ర రాతలు రాస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: