అతి ధీమానే  తెలుగుదేశంపార్టీ కొంప ముంచేసిందా ?  క్షేత్రస్ధాయిలో జరిగిన  పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  శాసనమండలి రద్దు నిర్ణయం తర్వాత మంగళవారం, బుధవారాల్లో శాసనమండలి కేంద్రంగా జరిగిన పరిణామాలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.  మండలి రద్దుకు క్యాబినెట్ నిర్ణయానికి చంద్రబాబునాయుడే ప్రధాన కారణమనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి.

 

పరిపాలనా వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి చట్టం-2020, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు వైసిపికున్న మెజారిటి కారణంగా   అసెంబ్లీలో  పాసైపోయాయి.  అయితే శాసనమండలికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది.  మండలిలో తనకున్న మెజారిటి కారణంగా  ఈ బిల్లుల విషయంలో  టిడిపి కంపు చేసేసింది.  అసెంబ్లీలో పాసైన బిల్లులు మండలిలో  ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నారు.

 

అయితే అనూహ్యంగా అసలు బిల్లులపై చర్చ జరగనీయకుండా టిడిపి అడ్డుపడింది. పైగా మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ను అడ్డం పెట్టుకుని  రెండు బిల్లులపై రెండు రోజులు పెద్ద డ్రామాను ఆడిన తర్వాత చివరకు సెలక్ట్ కమిటికి పంపింది. టిడిపి పన్నిన కుట్రలో స్వయంగా షరీఫే ప్రధాన పాత్ర పోషించిన విషయం బయటపడింది.  దాంతో ఈ పరిణామాన్ని ఊహించని జగన్ కు ఒళ్ళు మండిపోయింది. దానికి తోడు మంత్రులు, ఎంఎల్ఏలు కూడా మండలిని రద్దు చేయాల్సిందే అంటూ పట్టుబట్టారు. పైగా రద్దు ప్రచారం తెలిసి కూడా చంద్రబాబ, యనమల, అశోక్ బాబు నోటికొచ్చినట్లు మాట్లాడారు.

 

నిజానికి మండలిని రద్దు చేయబోతున్నట్లు బుధవారం  మధ్యాహ్నం నుండే ఫీలర్లు  మొదలయ్యాయి. అయితే మండలిని జగన్ ఎట్టి పరిస్ధితుల్లోను రద్దు చేయడని టిడిపి ధీమాతో ఉన్నది. ఎందుకంటే సభ్యత్వాలు కోల్పోయే  తొమ్మిదిమందిలో  ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి  మండలి రద్దవ్వదని అనుకున్నారు. కానీ టిడిపితో కలిసి ఛైర్మన్  చేసిన కంపు వల్లే చివరకు జగన్ మండలిని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.  మొత్తానికి ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని మరోసారి నిరూపణైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: