వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని ఏపీ కేబినెట్‌ సమావేశం ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో భాగంగా శాసనమండలి రద్దుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. దీంతో పాటు కేబినెట్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కడప ఆర్‌అండ్‌బీ ఆఫీసు ఆవరణలోని టీడీపీ కార్యాలయం తొలగింపునకు కేబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా.. విజయవాడలో శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ  రామానుజ చినజీయర్‌ ట్రస్ట్‌కు 40 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. 

 

కాగా చిన‌జీయ‌ర్ స్వామికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మ‌ధ్య దీర్ఘ‌కాలంగా స‌ఖ్య‌త ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఏపీలో పాదయాత్ర చేపట్టబోతున్న నేపథ్యంలో చిన జీయర్ స్వామిని క‌లిసిన జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. అనంత‌రం, ఎన్నిక‌ల ముందు కూడా చిన‌జీయ‌ర్‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం స‌హ‌జంగానే చ‌ర్చ‌కు దారితీస్తోంది. 

 

కాగా, ఈరోజ సమావేశమైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్, శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. అనంత‌రం మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చ చేస్తున్నారు. అసెంబ్లీలో ఆమోదముద్ర పొందిన తర్వాత ఈ బిల్లును వెంటనే కేంద్రానికి పంపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కేంద్రం మంత్రివర్గం కూడా దానికి ఓకే చెబితే పార్లమెంట్ ఆమోదం తెలిపే వరకు మండలి జరుగుతుంది. ఇదిలాఉండ‌గా, అసెంబ్లీ స‌మావేశాల‌ను టీడీపీ బాయ్‌కాట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. శాసనమండలి భవిష్యత్తును నిర్ణయించే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని టీడీపీ నిర్ణయించింది. మండలి రద్దు ఊహాగానాల నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమైన టీడీఎల్పీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శాసన మండలిపై శాసనసభలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: