శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ లో తీర్మానం చేయడం ద్వారా అటు ప్రతిపక్షం టిడిపి పూర్తిగా డీలా పడిపోగా ఆ ఎఫెక్ట్ అధికార పార్టీ వైసీపీకి కూడా గట్టిగానే తగిలినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందినా తనకు బాగా సన్నిహితులైన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణాజిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ కట్టబెట్టి మరి మంత్రి పదవులు ఇచ్చారు జగన్. అయితే తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంతో మరికొన్ని రోజుల్లో శాసన మండలి రద్దు అయ్యేలా జగన్ కేంద్రాన్ని కూడా ఒప్పించే అవకాశం కనిపిస్తోంది. 


ఎమ్మెల్సీ ద్వారా మంత్రులైన వారు మండలి రద్దయితే మంత్రి పదవులు కూడా వారు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వారు మంత్రి పదవులకు రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఎవరికి జగన్ అవకాశం కల్పిస్తారనే ఉత్కంఠ ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేల్లో నెలకొంది. అయితే జగన్ విధేయతతో పాటు, సామాజిక వర్గ సమీకరణం లెక్కలు సరిచూసుకొని మరి కొత్తగా ఇద్దరికీ తన కేబినెట్లో అవకాశం కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కృష్ణా జిల్లాకు చెందిన జోగి రమేష్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిడిరి అప్పలరాజు పేర్లు తెర మీదకు వస్తున్నాయి. 


వీరంతా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కావడంతో వీరిలో ఇద్దరిని క్యాబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలో జగన్ తమకు కూడా అవకాశం కల్పిస్తారనే ఆశలతో చాలామంది తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పదవి కోల్పోతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణకు జగన్ ఎటువంటి నామినేటెడ్ పదవులు అప్పగిస్తారు అనేది కూడా చర్చకు వస్తోంది. 


ఎందుకంటే వీరంతా మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్నారు. జగన్ వైఎస్సార్సీపీని స్థాపించిన సమయంలో మంత్రిగా ఉన్న సుభాష్ చంద్రబోస్ తన మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. అలాగే మోపిదేవి వెంకటరమణ జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఈ పరిస్థితుల్లో వీరికి జగన్ ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: