గత కొన్ని రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం మూడు రాజధానులు. భారీ ప్రజా మద్ధతుతో గెలిచిన వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు రాజధానులని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేబినెట్‌లో మూడు రాజధానులు, సి‌ఆర్‌డి‌ఏ రద్దు బిల్లులని ఆమోదించుకుని, అసెంబ్లీలో కూడా ఆమోదముద్ర వేసుకుంది. ఇక మండలిలో బిల్ పాస్ అయితే ప్రక్రియ పూర్తి అవుతుందనుకునే సమయంలో మూడు రాజధానులని వ్యతిరేకిస్తున్న టీడీపీ మండలిలో మెజారిటీని ఉపయోగించుకుని ఆ బిల్లులని సెలక్ట్ కమిటీకి పంపే నిర్ణయం తీసుకున్నారు.

 

సెలక్ట్ కమిటీకి పంపేందుకు రూల్స్ సరిగా లేవని చెబుతూనే, మండలి ఛైర్మన్... చంద్రబాబు డైరక్షన్‌లో బిల్లులని సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు చెప్పారు. ఇక ఇదే అంశం జగన్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఇంత ప్రజా మద్ధతు గెలిచిన తమ నిర్ణయాన్ని అడ్డుకున్న మండలిపై సీరియస్ అయ్యారు. భవిష్యత్‌లో తమకు ఎమ్మెల్సీల సంఖ్య పెరుగుతుందని తెలిసి కూడా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి...జగన్ మండలి రద్దుకు మొగ్గు చూపారు. ఆ మేరకు మండలి రద్దుని కేబినెట్‌లో ఆమోదించి, అసెంబ్లీలో కూడా ఆమోదించి కేంద్రానికి పంపారు. ఇక తర్వాత ప్రక్రియ కేంద్రం చేతిలో ఉంటుంది. అలా అని బిల్లుని కేంద్రం అడ్డుకునే పరిస్తితి లేదు.

 

బిల్లు ఎప్పటికైనా ఆమోదం చెందుతుంది కాబట్టి, ఆ విషయాన్ని పక్కనబెట్టేస్తే..మండలి రద్దుని ఏపీ ప్రజలు సమర్ధిస్తున్నారా? అంటే అవుననే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే మూడు రాజధానులకు అన్ని ప్రాంతాల మద్ధతు వచ్చింది. అదే క్రమంలో మూడు రాజధానులని అడ్డుకున్న మండలిని రద్దు చేయడాన్ని కూడా సమర్ధిస్తున్నారు. పైగా మండలి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకున్నారు. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పాలి...మండలి రద్దుని మెజారిటీ ప్రజలు సమర్ధిస్తున్న...రాజకీయ నాయకులు మాత్రం సమర్ధించే పరిస్థితిలో లేరని అర్ధమవుతుంది.

 

ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, వామపక్షాలు ఈ నిర్ణయాన్ని సమర్ధించడం లేదు. ఎందుకంటే మండలి రద్దు వల్ల వారి పదవులు ఊడిపోతాయి కాబట్టి. ఇదే సమయంలో అధికార వైసీపీలో కూడా కొందరు నేతలు కూడా ఈ నిర్ణయంపై కాస్త అటు ఇటూగానే ఉన్నారనే చెప్పొచ్చు. రానున్న రోజుల్లో వైసీపీకే ఎక్కువ ఎమ్మెల్సీ పదవులు రానుండటంతో...ఆశావాహులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అందుకే మంత్రులు కూడా జగన్‌ని రద్దుపై కాస్త ఆలోచించాలని కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఎమ్మెల్సీలు ఇవ్వాల్సిన వారికి వేరే రూపంలో న్యాయం చేస్తానని చెప్పి... జగన్...మండలి రద్దుకు ఆమోదం తెలిపారు. దీంతో వైసీపీ నేతలు కూడా అధినేత బాటలోనే మండలి రద్దుకు జై కొట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: