వంగవీటి రాధా...రాజకీయాల్లో నిలకడలేని తనానికి మారుపేరు. పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఒక పార్టీలోనూ సవ్యంగా ఉన్న దాఖలాలు లేవు. కాపు సామాజికవర్గంలో మంచి క్రేజ్ ఉన్న రాధా... మొదట కాంగ్రెస్‌లో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. దివంగత వైఎస్సార్ సపోర్ట్ తో తొలిసారి 2004లో విజయవాడ ఈస్ట్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2009 ఎన్నికల ముందు చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యంలో చేరి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

 

ఆయన పి‌ఆర్‌పిలోకి వెళ్లకుండా కాంగ్రెస్ లో ఉంటే పరిస్తితి వేరేగా ఉండేది. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోకి వెళ్లలేదు. అప్పుడే పార్టీ పెట్టిన జగన్ చెంతకు వెళ్లారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడు వైసీపీ కూడా ప్రతిపక్షానికే పరిమితమైంది. పోనీ అలా అయిన అదే పార్టీని నమ్ముకుని ఉండాలా అలా కాకుండా 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరి, పోటీకి దూరంగా ప్రచారానికి పరిమితమయ్యారు.

 

ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. టీడీపీ దారుణ ఓటమికు గురైంది. ఇక అక్కడ నుంచి రాధా పార్టీలో కనిపించలేదు. కొన్ని రోజులు జనసేనలో చేరతారని, కాదు కాదు మళ్ళీ వైసీపీలోకి వెళ్లతారని ప్రచారం జరిగింది. అయితే రాధా అదేం చేయలేదు. చాలారోజులు సైలెంట్‌గా ఉండి, ఇప్పుడు అమరావతికి మద్ధతు తెలుపుతూ, జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా మండలి రద్దుపై కూడా వ్యాఖ్యలు చేస్తూ....దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేసుకోమని జగన్‌కు సవాల్ విసిరారు.

 

అయితే రాజకీయ జీవిత పరంగా చాలా నష్టపోయిన రాధా...ఇప్పుడు బయటకొచ్చి విమర్శలు చేయడం వల్ల ఏం ఉపయోగమో అంతుపట్టని విషయం. ఇప్పుడేమన్న నాయకుడుగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్న అది పెద్ద ఉపయోగం లేని పనే. పోనీ భవిష్యత్‌లో టీడీపీలో ఏమన్నా పదవులు వస్తాయనుకుంటే...ప్రస్తుత పరిస్తితుల్ని చూస్తుంటే టీడీపీకే భవిష్యత్ లేకుండా పోయేలా ఉంది. మరి రాధా రాజకీయంగా ఏం సాధిద్దామనుకుంటున్నారో ఎవరికి అంతుచిక్కడం లేదు. మొత్తానికైతే రాధా రాజకీయం చూస్తుంటే...చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: