వైఎస్ జగన్ సర్కారుకు మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధంగా ఇంగ్లిష్ మీడియంలో పిల్లలను చదివించడమేంటని మండిపడింది. తమకు ఇష్టమైన మాధ్యమంలో చదువుకునే హక్కు విద్యార్థులకు ఉందని ఏపీ హైకోర్టు తెలిపింది. సర్కారీ బడుల్లో తెలుగు మీడియాన్ని తొలగించి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే బోధన చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 

దీనిపై శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేశాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లిష్ మీడియంలో నిర్బంధ బోధన కుదరదని స్పష్టం చేసింది. ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలని విద్యార్థులను నిర్బంధించలేమని తేల్చి చెప్పింది. అలా చేయడం సుప్రీం ఆదేశాలకు విరుద్ధమని తెలిపింది. అంతే కాదు.. ఈ కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఇంగ్లీష్ మీడియం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లరాదని అధికారులను ఆదేశించింది.

 

తమ ఆదేశాలను బేఖతరు చేస్తే.. అందుకు అయిన ఖర్చును మీ నుంచే రాబడతామని మరీ వార్నింగ్ ఇచ్చేసింది. ఇంగ్లీష్ మీడియం బోధన విషయంలో పట్టుదలగా ఉన్న జగన్ సర్కారుకు ఇటీవల ఏపీ శాసన మండలి కూడా షాక్ ఇచ్చింది. విద్య చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించగా.. శాసన మండలి దానికి సవరణలు సూచించింది. ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయించుకునే వెలుసుబాటు విద్యార్థికే ఇవ్వాలని మండలి సూచించింది.

 

తెలుగు మీడియంను కూడా ఉంచాలంటూ బిల్లును తిప్పి పంపింది. ఇప్పుడు కోర్టు కూడా దాదాపుగా ఇదే విషయం చెప్పింది. ఇంగ్లీష్ మీడియంపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.. తదుపరి విచారణకు ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది... సో.. ఇంగ్లీష్ మీడియం ఆలోచన ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: