భారత దేశం అంటే గ్రామాలే.. గ్రామాలు బావుంటేనే దేశం బావుంటుంది. క్రమంగా పట్టణ జనాభా పెరుగుతున్నా.. భారత్ ఆర్థిక వ్యవస్థ ఇంకా గ్రామీణ ప్రాధాన్యంగానే ఉంది. కానీ ఇప్పుడు గ్రామీణ భారతం అనేక సమస్యలతో కునారిల్లుతోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం క్రమంగా గ్రామాలనూ తాకుతోంది. అన్ని రంగాల్లోనూ గిరాకీ పడిపోయింది.

 

గ్రామీణ భారతం అంటే ముందుగా గుర్తొచ్చేది వ్యవసాయమే.. అయితే సాగు ముఖ్యమే అయినా.. అదే పల్లెటూరి ఆర్థిక వ్యవస్థ కాదు. తాజా గణాంకాల ప్రకారం.. గ్రామీణ ఉత్పాదకతలో వ్యవసాయం వాటా 39శాతం మాత్రమేనని తేలింది. అంటే.. దాదాపు 60 శాతం పల్లెటూళ్లోనూ.. తయారీ రంగం, నిర్మాణ రంగం, సేవారంగాల నుంచే ఆదాయం వస్తోంది.

 

వ్యవసాయంపైనే ఆధారపడకుండా ఈ మిగిలిన రంగాలకు చేయూత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. వ్యవసాయంపై ఆదాయం 40 శాతం వస్తున్నా దానిపై ఆధాపడే శ్రామికుల సంఖ్య మాత్రం 64 శాతమని గణాంకాలు చెబుతున్నాయి. అంటే తక్కువ ఆదాయం కోసం ఎక్కువ మంది కష్టపడుతున్నారన్నమాట. ముందు ఈ లెక్కలు సరిచేస్తే తప్ప గ్రామీణాభివృద్ధి సులభతరం కాదు.

 

అంటే గ్రామీణ ప్రాంతంలోని శ్రమ శక్తిని వ్యవసాయం నుంచి క్రమంగా తయారీ రంగం, నిర్మాణ రంగం, సేవారంగాల పైవు మరల్చినప్పుడే పల్లెటూళ్లు నాలుగు రూపాయలు కళ్ల జూస్తాయన్నమాట. అందుకే బడ్జెట్ రూపకల్పన కూడా ఈ దిశలోనే సాగాలి. ఇది సాధ్యం కావాలంటే వ్యవసాయంలో ఆధునిక పనిముట్ల వాడకం పెరగాలి.

 

 

అప్పుడు సాగు కోసం పని చేయాల్సిన శ్రమ శక్తి తగ్గుతుంది. అదే సమయంలో మిగిలి పల్లె శ్రమ శక్తిని మిగిలిన రంగాల్లో ప్రోత్సహించేందకు అనువైన విధానాలు రూపొందించాలి. వాటికి బడ్జెట్ ద్వారా దన్ను కల్పించాలి. ఆ చొరవే ఇప్పుడు బడ్జెట్ లో కనిపించాలి. అప్పుడే పల్లె నవ్వుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: