సామినేని ఉదయభాను.... వైసీపీ సీనియర్ నేత, జగ్గయ్యపేట ఎమ్మెల్యే. 1989లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భాను.. 1997లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అలాగే 1998 లో పీసీసీ కార్యదర్శిగా ఎంపికై కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. ఇక తొలిసారి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జగ్గయ్యపేట టికెట్ దక్కించుకుని పోటీలో దిగారు. రాష్ట్రమంతా టీడీపీ గాలులు ఉన్న ఉదయభాను మంచి మెజారిటీతో విజయం సాధించారు.

 

ఇక 2004లో కూడా మరోసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో భానుకు...వైఎస్సార్ ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు ఇచ్చారు. అనంతరం 2009లో కాంగ్రెస్ తరుపున, 2014 వైసీపీ తరుపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరుపున టికెట్ దక్కించుకుని జగ్గయ్యపేటలో అద్భుత విజయం సాధించారు. మొత్తంగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలవడంతో జగన్ కేబినెట్‌లో అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ సామాజికవర్గాల సమీకరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అయితే ప్రభుత్వ విప్ మాత్రం దక్కింది.

 

మంత్రి దక్కకపోయిన పెద్దగా అసంతృప్తి లేకుండానే సామినేని తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే టీడీపీ సగంలోనే ఆపేసిన అభివృద్ధి పనులని పూర్తి చేస్తున్నారు. రామిరెడ్డిపల్లిలో పీహెచ్‌సీ ఏర్పాటు, ఆర్టీసీ బస్‌ సౌకర్యం, అసంపూర్తిగా ఉన్న కూడలి బ్రిడ్జి నిర్మాణం లాంటి పనులు పూర్తికి కృషి చేస్తున్నారు. ఇక వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన జరిగిన పోలంపల్లి రాజీవ్ మునేరు డ్యామ్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిల్లకల్లు హైవే వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు, కృష్ణా నది      పై వైకుంఠపురం గ్రామం సమీపంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఇటీవల సీఎంని కోరారు.

 

ఇలా అభివృద్ధి పనులతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. అలాగే ప్రతిపక్ష టీడీపీకి అసెంబ్లీలో గానీ, మీడియాలోనూ గానీ కౌంటర్లు ఇవ్వడంలో సామినేని ముందున్నారు. అయితే అంతా బాగానే ఉన్న రాజధాని ఇష్యూ జగ్గయ్యపేటలో బాగానే ఉంది. నియోజకవర్గంలో అమరావతిని సమర్ధించే వాళ్ళు ఎలా ఉన్నారో, మూడు రాజధానులని సమర్ధించే వారు కూడా ఉన్నారు. కాకపోతే ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టే స్థాయిలో అమరావతి ఉద్యమం అక్కడ లేదు. మొత్తానికైతే జగ్గయ్యపేటలో సామినేనికి కాస్త అనుకూల వాతావరణమే ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: