కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే చైనాలో దాదాపు 200 మంది వరకూ ఈ వ్యాధితో మృత్యువాత పడ్డారు. మరో 500 మంది వరకూ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక కరోనా ముప్పు అత్యధికంగా పొంచి ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే భారత్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయి కూడా. అయితే ఇప్పడో షాకింగ్ న్యూస్ ఏంటంటే. కరోనా ఓ భారతీయుడిని బలితీసుకుంది.

 

త్రిపురకు చెందిన మనీర్ హుస్సేన్ అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. అయితే అతడు చనిపోయింది ఇండియాలో కాదు. మునీర్ ఉద్యోగం కోసం మలేషియాలో ఉంటున్నాడు. అక్కడ ఓ రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం అతడికి సోకింది కరోనా గా గుర్తించారు. తాజాగా అతడు మరణించినట్టు మలేషియా ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ విషయం తెలిసి అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అతడి మృతదేహం ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు.

 

ఇది ఇలా ఉంటే.. భారత్‌లోనూ కరోనా వైరస్‌ తొలి కేసు నమోదైంది. కేరళకు చెందిన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ధ్రువీకరించింది. ఈ విద్యార్థి చైనాలోని వుహాన్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. కరోనా కలకలంతో అతడు భారత్‌ తిరిగివచ్చాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిమితంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

 

ఇంకా.. భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో అనుమానితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. హైదరాబాద్‌, కేరళ, పట్నాలోను కరోనా అనుమానితులు ఆసుపత్రుల్లో చేరారు. చైనా నుంచి భారత్‌ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: