ఏపీ సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొద్దిపాటి మార్పులు చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డిని ఆహార శుద్ధి శాఖ నుంచి తప్పించారు. అంతే కాదు.. మోపిదేవి వెంకట రమణ శాఖల నుంచి మార్కెటింగ్ శాఖను తొలగించారు. ఈ రెండు శాఖలు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు అప్పగించారు. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎంఓ తెలిపింది.

 

 

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ అకస్మిక నిర్ణయం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో చర్చ జరుగుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమల మంత్రిగా మంచి పని తీరే కనబరుస్తున్నారు. అం తే కాకుండా.. జగన్ మంత్రి వర్గంలో వివాదాలకు దూరంగా.. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండే కొద్ది మంది మంత్రుల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఒకరు.

 

 

అలాగే మరో మంత్రి మోపిదేవి వెంకట రమణ నుంచి మార్కెటింగ్ శాఖను తొలగించడం కూడా అనూహ్యమైన మార్పుగానే చెప్పుకోవాలి. మోపిదేవి వెంకట రమణకు జగన్ ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా సరే జగన్ పట్టుబట్టి ఆయన్ను తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

 

 

తాను నమ్మినవారి కోసం ఏమైనా చేస్తాడనే పేరు జగన్ కు రావడానికి మోపిదేవిని మంత్రిని చేయడం వంటి చర్యలు కూడా కారణమే. మరి అంతటి కీలకంగా ఉన్న మంత్రి నుంచి కీలకమైన శాఖను తప్పించడం అంటే సాధారణ విషయం కాదు. అయితే తాజాగా శాసన మండలిని రద్దు చేసిన సమయంలో మంత్రి మోపిదేవి భవితవ్యంపై ఊహాగానాలు చెలరేగాయి.

 

 

మంత్రి మోపిదేవి మండలి సభ్యుడు కాబట్టి ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాయి. దీనిపై స్పందించిన మంత్రి మోపిదేవి.. మండలి రద్దుకు అధికారిక ఉత్తర్వులు కేంద్రం నుంచి రాగానే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇంతలోనే ఆయనకు చెందిన శాఖను తొలగించడం చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: