జగన్ సీఎం.. అంటే ముఖ్యమంత్రి.. సీఎం అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ సీఎం అనేగా అర్థం. అలాగే చంద్రబాబు ప్రతిపక్షనేత.. అంటే ఆయన కూడా అన్ని జిల్లాలకూ నాయకుడు అనేగా.. కానీ ఇప్పుడు సీన్ మారుతోందట. చంద్రబాబు రాష్ట్రం మొత్తం సంగతి ఏమో కానీ.. 16 నియోజక వర్గాలు, 29 గ్రామాలకు మాత్రం చంద్రబాబే నాయకుడట. ఇదీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చెబుతున్నమాట.

 

పైకి చూస్తే ఇదేదో పొగడ్తలాగా అనిపించొచ్చు. కానీ రోజురోజుకూ చంద్రబాబు పాత్ర పరిమితం అవుతుందన్న కోణంలో జోగి రమేశ్ ఇలా విమర్శించారు. చంద్రబాబు 16 నియోజకవర్గాలకు, 29 గ్రామాలకే నాయకుడిగా పరిమిమయ్యారని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావటం కాయమని జోగి రమేశ్ చెబుతున్నారు. అంతే కాదు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోకి చంద్రబాబు వెళ్తే మహిళలు చీపుళ్ళతో కొడతారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అంటున్నారు.

 

 

అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలంటే సాధ్యం కాదని, భావితరాల కోసం రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఎమ్మెల్యే జోగి రమేష్‌ సూచించారు. రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని జోగి రమేష్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. గూడురు మండలం నుంచి పెడన పట్టణం వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానులు ఉండాలన్నారని, ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని జోగి రమేష్‌ మండిపడ్డారు. జోలె పట్టుకుని రాజకీయ బిచ్చగాడిగా మారాడని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: