తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెల 1వ తేదీ నుండి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వలన పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెరగనుంది. కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ మేరకు హామీ ఇచ్చారు. 
 
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ త్వరలో జరగబోయే కేబినేట్ భేటీ సమయానికి ఈ హామీ అమలుకు సంబంధించిన ఫైల్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది 61ఏళ్లకు పదవీ విరమణ వయస్సును పెంచటం వలన 26,133 మంది ఉద్యోగులకు అదనపు సర్వీస్ కలిసిరానుంది. ఉన్నతాధికారుల కమిటీ 33ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి ఈ పెంపు వర్తింపజేయకూడదని నిర్ణయం తీసుకోగా కేసీఆర్ మాత్రం వారికి కూడా పెంపును వర్తింపజేయనున్నట్టు సమాచారం. 
 
ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగానే కేసీఆర్ ఉద్యోగుల సర్వీస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుతో సంబంధం లేకుండా వయస్సును 61 సంవత్సరాలకు పెంచినట్టు తెలుస్తోంది. ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తే మూడు సంవత్సరాల పాటు ఎటువంటి రిటైర్‌మెంట్లు ఉండవు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు మూడు సంవత్సరాల పాటు సర్వీస్ పెరగనుంది. 
 
ఈ పెంపు ఉత్తర్వులు అమలులోకి రాకపోతే ఈ సంవత్సరం 7,040 మంది పదవీ విరమణ చేయాల్సి ఉంది ఆ తరువాత రెండేళ్లు కూడా కలుపుకుంటే మొత్తం 26,133 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందాల్సి ఉండగా వీరికి మూడు సంవత్సరాల పాటు అదనంగా సర్వీసులో కొనసాగటానికి వీలు కలగనుంది. సీఎం కేసీఅర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: