మహిళలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మహిళలకు రుతుక్రమం సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఎన్నో మానసిక, శారీరక ఒత్తిడుల సంగతి తెలిసిందే. దీని వల్ల వారు చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. కానీ ఉద్యోగస్తులైతే.. ఆ రోజుల్లో కూడా డ్యూటీ చేయాల్సిందే. కానీ ఇకపై అలా చేసే అవసరం ఉండకపోవచ్చు.

 

ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. రుతుక్రమం వేళ మహిళలకు ఉపశమనం కల్పించేలా, వేతనంతో కూడిన మూడు రోజుల సెలవు ఇచ్చే అంశంపై ఆలోచన జరుగుతోంది. ఎనిమిది, ఆ పైతరగతులు చదువుతున్న బాలికలు, యువతులు, మహిళలు రుతుక్రమ సమయంలో విద్యాలయాలకు మూడు రోజులు సెలవు తీసుకోవడాన్ని హక్కుగా కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎంపీ ఎస్‌.జ్యోతిమణి గత పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేటు ( రుతు క్రమ ) బిల్లు ప్రవేశ పెట్టారు.

 

కేంద్రం కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తోంది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగనీయకుండా పని ప్రదేశాల్లో, దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర కార్మికశాఖ ఆలోచిస్తోందట. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఇది అమలులో ఉంది. వారి తరహాలోనే ‘‘రుతుక్రమ పరిశుభ్రత - వేతనంతో కూడిన సెలవును హక్కుగా అమలు చేయాలని ఎంపీ జ్యోతి మణి తన బిల్లులో ప్రతిపాదించారు. ఇప్పుడు కేంద్రం ఈ బిల్లుపై ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగినులు, విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల నుంచి కార్మికశాఖ అభిప్రాయాలు కోరుతోంది.

 

ఈ బిల్లు అమల్లోకి వస్తే .. ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలు, సంస్థల్లో పనిచేస్తున్న యువతులు, మహిళలకు రుతుక్రమ సమయంలో వేతనంతో కూడిన సెలవు దక్కుతుంది. ఒకవేళ ఆ రోజుల్లో ఉద్యోగిని పనిచేసే పక్షంలో, ఒక రోజులో పొందుతున్న వేతనానికి అదనంగా రోజు వేతనం చెల్లిస్తారు. ఉద్యోగిని అనుమతి లేకుండా యాజమాన్యాలు అదనపు సమయం పనిచేయించడానికి వీలుండదు. మరుగుదొడ్లలో రుతురుమాళ్లు అందుబాటులో ఉంచుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: