చంద్రబాబు ప్రెస్ మీట్ అంటే చాలు.. విపరీతమైన బోరింగ్ ఈ విషయం అందరికీ తెలిసిందే. చెప్పిందే చెప్పి.. మళ్లీ మళ్లీ చెప్పి.. విసిగిస్తాడు.. అందులో కొత్త పాయింట్ వెదుక్కోలేక జర్నలిస్టుల బుర్రలు పగిలిపోతుంటాయి. అయితే సోమవారం చంద్రబాబు ప్రెస్ మీట్ దాదాపు గంటన్నర సాగింది. దీంతో ఈ ప్రెస్ మీట్ కు హాజరైన విలేఖరులు తలలు పట్టుకున్నారు.

 

ఇంకెంత సేపు బాదేస్తావ్ బాబూ అంటూ మనసులోనే తిట్టుకున్నారు. మొత్తానికి దాదాపు గంటన్నర సేపు మాట్లాడిన తర్వాత బాబు గారు శాంతించారు. ఇక జర్నలిస్టులు లేచి వెళ్లిపోదాం అనుకునే సమయానికి గుంటూరు జిల్లా టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్.. సూటూ బూటూ వేసుకున్న ఓ పదేళ్ల బుడ్డోడిని చంద్రబాబుకు పరిచయం చేశారు.

 

 

ఎన్నారై కుటుంబానికి చెందిన ఈ కుర్రాడు.. అక్కడ నుంచి చంద్రబాబును ఇంగ్లీష్ లో దంచేశాడు. తాను అమెరికా నుంచి వచ్చానని చెబుతూ.. తాను ఆరేళ్ల వయస్సు నుంచే సాధించిన విజయాలను చంద్రబాబుకు వివరించారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెల్ బీ విజేతగా నిలిచాడట ఆ కుర్రోడు. ఇంకా చాలా చాలా సాధించాడట. అవన్నీ చెబుతుంటే చంద్రబాబు ఆశ్చర్యంతో విన్నారు.

 

అంత వరకూ బాగానే ఉంది.. చివరలోనే ఇచ్చాడా బుడ్డోడు చంద్రబాబుకు అసలు షాకు.. ఇదిగోండి.. ఇదీ నా విజిటింగ్ కార్డు అంటూ ఓ కార్డు చంద్రబాబు చేతిలో పెట్టాడు. వీలున్నప్పుడు కలవండి అంటూ ఝలక్ ఇచ్చాడు. చంద్రబాబు కూడా ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యపోయారు.

 

ఇంతకీ ఈ కుర్రాడెవరంటే.. ఇతని తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా వెంకటగిరి చెందిన వారట. అమెరికాలో స్థిరపడ్డారు. చంద్రబాబుపై అభిమానంతో ఆయన్ను కలవడానికి వచ్చారట. అదీ సంగతి. ఇచ్చిన షాకంతా ఇచ్చేశాక.. నేను మీ హెరిటేజ్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేశాను.. చాలా బావుందీ అంటూ ఓ బిస్కట్ కూడా వేశాడీ బుడ్డోడు బాబు గారికి.

మరింత సమాచారం తెలుసుకోండి: