అమరావతి భూముల విక్రయాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. అందుకు కొన్ని వివరాలను కూడా అసెంబ్లీలో బయటపెట్టింది. అయితే అవి నేర నిరూపణకు సరిపోతాయా లేవా అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమరావతిలో భూ క్రయ విక్రయాలపై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ ఎంపీ, పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరడం సంచలనం సృష్టిస్తోంది.

 

రాజధానిలో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే.. రాష్ట్రంలో పెట్టుబడులు తరలి పోతున్నాయని తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. రూ.25 వేల కోట్ల సోలార్‌ పార్కు ఏర్పాటుకు సింగపూర్‌, అబుదాబి ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోబోతున్నామని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ రాజధాని భూముల గురించి ప్రస్తావించారు.

 

ఒక సీఎం రాజధానిని తిరువూరు వద్ద పెడతామని చెప్పి.. భూములు కొన్న తర్వాత తిరువూరు కాదు.. అమరావతిని ప్రకటించడం ప్రమాణస్వీకారాన్ని ఉల్లంఘించడమేనని మిథున్‌రెడ్డి అన్నారు. ఇది పెద్ద కుంభకోణమని ఆరోపించారు. 4 వేలకు పైగా ఎకరాలు తెలుగుదేశం నేతల చేతుల్లో ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 780 మంది రూ.కోట్లలో పెట్టి భూములు కొన్నారని, ఆదాయపు పన్ను పరిధిలోని లేని వ్యక్తులు ఎలా కొనగలరని ప్రశ్నించారు.

 

ఇలాంటి అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామని, ఈ కుంభకోణం బయటకు రావాలని మిథున్‌రెడ్డి అన్నారు. రాజధాని భూముల అక్రమాలపై ఏపీలో విచారణ జరుగుతుందని లోక్‌సభలో చెప్పారు. అయితే మరి ఈ భూములపై సీబీఐ విచారణ జరిపితే ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఎవరి లాబీయింగ్ నడిస్తే వారికే మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏపీ సీఐడీతో విచారణ జరిపించకుండా సీబీఐకి అప్పగించడం చూస్తే జగన్ ఓ మంచి ఛాన్స్ మిస్సయ్యారన్న వాదన కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: