ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సినీ నటులు చిరంజీవి నాగార్జునతో భేటీ అయినట్లు మంత్రి తలసాని తెలిపారు. హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌లో చిరంజీవి నివాసంలో.. చిరు, నాగార్జునలతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. సినిమా రంగం అభివృద్ధికి సంబంధించి మంత్రి వారితో చర్చించినట్టు సమాచారం. చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తామని.. దీనికి సంబంధించి సినిమా రంగానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

సినిమా రంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. టీవీ9 నవ నక్షత్ర అవార్డుల ప్రదానోత్సవం’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖలందరితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు.

 

ఓ కార్యాచరణ రూపొందించుకొని సీఎం కేసీఆర్‌ను కలుద్దామని సినీ ప్రముఖులకు చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ ఏడాది రెండు, మూడు ఈవెంట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఆయన తెలిపారు. నాగార్జున‌, బాల‌కృష్ణ, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్రభాస్‌తో పాటు ఇత‌ర యువ క‌థానాయకుల‌ను కూడా ఈ ఈవెంట్‌లో భాగం కావాల‌ని కోర‌తానని చెప్పారు. ఇండ‌స్ట్రీకి సంబంధించి అన్ని వివ‌రాల‌ను డైరీలో పొందుప‌రిచిన‌ట్టు తెలిపారు. 

 

హైదరాబాద్‌లో ఏడాదికి 250 సినిమాల వరకు నిర్మాణం అవుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. నగరంలో రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియో తదితర ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయని గుర్తుచేశారు. సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి భాగ్యనగరంలో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గతంలో తనను కలిసినప్పుడు ఇదే సూచన చేశారని ముఖ్యమంత్రి వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అందరం క‌లిసి చ‌ర్చించుకుందామనీ ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులకు పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: