ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే విధంగా గత సంవత్సరం ఒక కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరహా చట్టాన్నే కర్ణాటకలో కూడా తీసుకొనిరావాలని భావిస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొనిరానున్నట్టు సమాచారం. 
 
కర్ణాటక రాష్ట్ర లేబర్ మినిష్టర్ సురేష్ కుమార్ కర్ణాటక రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్ల గురించి స్పందించారు. స్థానికులకు ఉద్యోగాల్లో 75 శాతం ఇచ్చే విధంగా చట్టం రూపొందించనున్నట్టు తెలిపారు. స్థానికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే తాము ఇలాంటి చట్టానికి రూపకల్పన చేస్తున్నామని ఇది ఎవరినీ వివక్షకు గురి చేసే విషయం కాదని సురేష్ కుమార్ అన్నారు. 
 
కన్నడిగులు తాము వివక్షకు గురవుతున్నామని భావిస్తున్నారని, బయటివాళ్లు వచ్చి తమకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని కన్నడిగులు భావిస్తున్నారని అందువలనే ఈ చట్టం దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో ఈ బిల్లును ఖరారు చేయనున్నామని ఈ బిల్లు అమలు కోసం న్యాయ నిపుణులను, రాష్ట్ర ప్రజలను సంప్రదించనున్నామని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర లేబర్ డిపార్టుమెంట్ కర్ణాటకలో 15 సంవత్సరాలుగా నివశిస్తున్న మరియు కన్నడ భాష రాయడం, చదవడం తెలిసిన వారు కన్నడిగగా పరిగణింపబడతారని పేర్కొంది. 
 
మంత్రి సురేష్ కుమార్ మాట్లాడుతూ అందరి ఏకాభిప్రాయంలో ఈ చట్టం అమలు దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇటువంటి చట్టాలను తీసుకొనిరావటానికి బలమైన కారణం పని చేసే ప్రదేశాల్లో భాషా అవరోధాల వలన కలిగే ప్రమాదాలను కూడా నిరోధించటం కోసం కూడా అని అధికారులు చెబుతున్నారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ఈ చట్టం అమలులోకి వస్తే బెంగళూరులో భారీ సంఖ్యలో పని చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: