అవును.. నిజమే. కొడంగల్‌, బషీరాబాద్‌లో జరిగిన కహాని ఇది. జిల్లావ్యాప్తంగా 18 మండలాలలో మొత్తం 22 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. వీటికి ఈనెల 15న ఎన్నికలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి ప్రతి మండలంలో 13 మంది డైరక్టర్ల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 2018లోనే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసినప్పటికీ వాయిదా పడ్డాయి. అయితే 31.12.2018 కోసం తయారుచేసిన ఓటర్ల జాబితా ప్రకారమే ప్రస్తుతం ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు.

 

వీరిలో చనిపోయిన వారు వందల్లోనే ఉంటారని సహకార సంఘాల అధికారులే చెబుతున్నారు. అయితే, మరికొందరు రుణాలు సకాలంలో చెల్లించినా.. తమ పేర్లు జాబితాలో కనిపించడం లేదంటూ అధికారులకు తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. కొడంగల్‌ పట్టణం బాలాజీనగర్‌ కాలనీకి చెందిన అరిగె శివప్ప తండ్రి హన్మప్ప 1999లో మృతిచెందారు. ఆయన ఓటు హక్కు నేటికీ సహకార ఎన్నికల ఓటరు జాబితాలో ఉంది. అలాగే ర్యాలపేట వెంకటయ్య వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తూ గత 8 సంవత్సరాల క్రితం మృతిచెందారు. అతని పేరు సైతం ఫొటోతో సహా ఉంది.

 

ఒక్క కొడంగల్‌ ప్రాథమిక సహకార సంఘంలోనే మొత్తం 2,878 ఓటర్లకుగాను దాదాపు 200కు పైగా పేర్లు తప్పులు ఉండటంతో పాటు పలువురు మృతుల పేర్లు వచ్చాయి. అర్హులైన వారి ఓట్లను తొలగించి.. అనర్హుల పేర్లు జాబితాలో ఉండటంతో బరిలో నిలిచే అభ్యర్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వార్డుకు 150-250 వరకు ఓట్లు ఉంటాయి. ఒక్కో ఓటు కీలకంగా మారుతుంది. వార్డుల్లో ఓట్లను పరిశీలిస్తే మృతిచెందిన వారివి, ఒకరిపేరు వద్ద మరొకరి ఫొటో, కులాలు వివరాలు తప్పుగా నమోదు కావడంతో ఓటేసే సమయంలో సమస్యలు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

పాతికేళ్ల క్రితం సహకార ఎన్నికల్లో ఓటరుగా నమోదైన వ్యక్తుల ఓట్లు గత మూడు నెలల క్రితం సైతం ఉండి ప్రస్తుతం లేకపోవడంతో అందోళన చెందుతున్నారు. అదే సమయంలో ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు, ఫొటోలతో సహా తాజా జాబితాలో ఉండటం విస్మయపరుస్తోంది. ఇలా ఒకటో.. రెండో కాదు.. వందల సంఖ్యలో తప్పులు దొర్లడంతో ఓటర్లతో పాటు అధికారులు సైతం గందరగోళంతో తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: