సోషల్ మీడియా కారణం ఎంత మంచి జరుగుతుందో అదే స్థాయిలో చెడు కూడా జరుగుతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా పరిచయాలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్న సంఘటనలు తరుచూ వార్తల్లో వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడిన ఓ ఎన్నారై యువతి, దారుణంగా మోసపోవటంతో పాటు తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది. చివరకు పోలీసులను ఆశ్రయించింది.

 

చాలా కాలంగా అమెరికాలో ఉంటున్న ఓ ఎన్నారై మహిళను ఫేస్‌బుక్ ఫ్రెండ్ పేరుతో ట్రాప్ చేశాడో వ్యక్తి. ఆమె ఇండియాకు వచ్చిన తరువాత నమ్మకంగా ఆమెకు దగ్గరయ్యాడు. తరువాత కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి రేప్ చేశాడు. అంతేకాదు రేప్‌ చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి అవి బయటపెడతానంటూ బెందరించి ఆ మహిళ నుంచి లక్షల రూపాయల సొమ్ము, బంగారం తీసుకున్నాడు. అయినా వేదింపులు తగ్గకపోవటంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.


వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ ప్రాంతానికి చెందిన సంజీవ రెడ్డి కొంత కాలంగా హైదరాబాద్‌ నిజాంపేటలో నివాసముంటున్నాడు. కొద్దిరోజుల కిందట అమెరికాలో ఉంటున్న హైదరాబాద్‌ యువతికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆ రిక్వెస్ట్‌ను ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం మరింత పెరగటంతో ఇద్దరు ఫోన్‌లలో మాట్లాడుకున్నారు. ఆమె ఇండియా తిరిగి వచ్చినప్పుడు సంజీవ్‌ రెడ్డి స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి ఆమెను రిసీవ్‌ చేసుకున్నాడు.

 

అయితే ఆమె దగ్గర డబ్బులు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమెకు దగ్గరైన సంజీవ రెడ్డి పథకం ప్రకారం ఆమెను మోసం చేశాడు. మహిళ ఇండియాకు వచ్చిన రెండు రోజుల తరువాత లంఛ్‌కి హోటల్‌కి పిలిచాడు. అక్కడ తన కుటుంబ సభ్యులను ఆమెకు పరిచయం చేశాడు. అయితే ఆ మహిళ భోజనం చేయనని చెప్పటంతో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీంతో ఆ మహిళ స్పృహతప్పి పడిపోయింది.


తరువాత ఆమెను ఇంటికి తీసుకెళ్లి దారుణంగా రేప్‌ చేశారు. ఆ దృశ్యాలను వీడియో తీశారు. అప్పటి నుంచి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను బెదిరించటం ప్రారంభించాడు. ఇప్పటి వరకు దాదాపు 30 తులాల బంగారం, 50 లక్షల వరకు డబ్బు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వేదింపులు మరీ ఎక్కువ కావటంతో బాధితురాలు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంజీవ రెడ్డి, అతని భార్య కావేరి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: