తెలంగాణ రాష్ట్ర కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నెలరోజులపాటు మేడారం జాతర ఉత్సవాలు జరగగా మహాజాతర నాలుగు రోజుల పాటు జరిగింది. మరో రెండేళ్ల వరకు జాతర రాదని భక్తులు కూడా ఖర్చు విషయంలో పెద్దగా ఆలోచించకుండా వేల రూపాయలు జాతర కోసం ఖర్చు చేశారు. ముక్క, మందు కోసం ఖర్చు పెట్టడానికి భక్తులు భారీగా ప్రాధాన్యత ఇవ్వడంతో మేడారం జాతరలో వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. 
 
అధికారులు మేడారం జాతర ఉత్సవాల్లో దాదాపు 235 కోట్ల రూపాయల బిజినెస్ జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సమ్మక్క సారక్క భక్తులు చీర, సారెలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులను తీర్చుకున్నారు. అధికారులు మేడారం జాతరలో దాదాపు 158 కోట్ల రూపాయల మాంసం విక్రయాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అధికారులు భక్తులు 130 కోట్ల రూపాయల విలువ గల మేకలు, గొర్రెలు 28 కోట్ల రూపాయల విలువ గల కోళ్లను ఆరగించినట్టు చెబుతున్నారు. 
 
ఈ ఉత్సవాలలో దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిపినట్టు తెలుస్తోంది. మేడారం జాతర కోసం భక్తులు దాదాపు 800 టన్నుల బెల్లం కొనుగోలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో కొబ్బరికాయను 80 రూపాయల చొప్పున అమ్మగా దాదాపు 30 లక్షల కొబ్బరికాయలు అమ్ముడవడం గమనార్హం. కేవలం కొబ్బరికాయల అమ్మకం ద్వారా 12 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. 
 
గతంతో పోలిస్తే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇవి కాకుండా చిరువ్యాపారులు దాదాపు 50 కోట్ల రూపాయల బెల్లం విక్రయించినట్టు తెలుస్తోంది. మేడారం జాతరలో టెండర్లు దక్కించుకున్నవారికి కాసుల పంట పండింది. దాదాపు కోటీ 30 లక్షల మంది భక్తులు మేడారం జాతరకు హాజరు కావడంతో వ్యాపారులకు రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: