తెలంగాణా రాష్ట్ర పాలనాలో తనదైన ముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అహర్నిషలు శ్రమిస్తున్నారు. తాజాగా పాలనా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లాల స్థాయిలో రెవెన్యూ యాక్ట్ అమలు, భూ వ్యవహారాలను చూసే జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) పోస్టును రద్దు చేసింది.


తెలంగాణలోని 33 జిల్లాలకు జాయింట్‌ కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించింది. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్లుగా ఉన్న చాలామందిని అదే జిల్లాలకు అధనుపు కరెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చింది ప్రభుత్వం. 14 జిల్లాలకు వేరే అధికారులను అదనపు కలెక్టర్లుగా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది నాన్‌కేడర్, కేడర్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.


ఐఏఎస్‌ తరహాలోనే ఓ రాష్ట్ర విభాగాన్ని నెలకొల్పి పాలనా సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేని కొత్త రెవెన్యూ చట్టం రూపొందించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే జాయింట్ కలెక్టర్లను రద్దు చేసిన అదనపు కలెక్టర్ల పోస్ట్‌లు సృష్టించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కీలకమైన కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్టాల అమలు బాధ్యతలను అప్పగించనుంది.


పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, అకస్మిక తనిఖీలు, నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకునే అధికారాలను అదనపు కలెక్లర్లకు ఇవ్వనున్నారు. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లను సైతం వీరి పరిధిలోకి తీసుకురానుంది ప్రభుత్వం. లే అవుట్ల అనుమతులు, ప్రాపర్టీ అసెస్‌మెంట్స్‌ లాంటి పనులు కూడా వీరికే అప్పగించే అవకాశముంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, పారిశుధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, సర్టిఫికెట్ల జారీ లాంటి అంశాలు కూడా ఇక మీద అదనపు కలెక్టర్ల బాధ్యతే. వీరికి సంబంధించిన పూర్తి బాధ్యతల వివరాలు ఈనెల 11న నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ల మీటింగ్‌లో కేసీఆర్‌ స్పష్టత ఇవ్వనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: