తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో పంపిణీ చేసిన నులిపురుగుల నివారణ మాత్రలు వికటించటంతో బాలిక  సహస్ర మృతి చెందింది. మాత్రలు వేసుకున్న కొంత సమయానికే సహస్ర అపస్మారకస్థితిలోకి వెళ్లిపోవడంతో పాఠశాల యాజమాన్యం బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు బాలిక చనిపోయిందని చెప్పారు. 
 
పాఠశాలకు వెళ్లిన చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు చెప్పటంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నులి పురుగుల మాత్రలు వేసుకున్న ఇతర విద్యార్థులు కూడా అస్వస్థతకు గురి కావడం గమనార్హం. విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు విద్యార్థులకు చికిత్స అందించారు. చికిత్స అనంతరం విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారు. 
 
ఈరోజు ఉదయం ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నివారణ మందుల పంపిణీ జరిగింది. పిల్లలు నులిపురుగుల వలన సరైన ఎత్తు, బరువు లేక రక్తహీనత సమస్యలతో బాధ పడుతుంటారని ప్రభుత్వం నులిపురుగుల నివారణ మాత్రలను ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పంపిణీ జరిగేలా కార్యక్రమం చేపట్టింది. 
 
కానీ నులిపురుగుల నివారణ మాత్రలు వికటించటంతో చిన్నారి సహస్ర మృత్యువాత పడింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రలు ఆల్బెండజోల్ ను అందజేస్తారు. నులి పురుగుల మాత్రలు వేసుకుంటే పిల్లల కడుపులో ఉండే గుండ్ర, బద్దె, నులి, కుంకి పురుగులు నశిస్తాయి. సహస్ర మృతి గురించి పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: