సాధారణంగా మెజారిటీ శాతం రైలు ప్రయాణికులు రైలు ప్రయాణం చేయాలంటే స్టేషన్ కు వెళ్లి టికెట్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ గురించి అవగాహన ఉన్నవారు మాత్రం ఆన్ లైన్ బుకింగ్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటారు. కానీ అతి త్వరలో రైల్వే శాఖ ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లను విక్రయించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం రైల్వే శాఖ మొదట ప్రైవేట్ రైళ్ల టికెట్లను పూర్తిగా ఆన్ లైన్ లో విక్రయించనున్నట్టు తెలుస్తోంది. 
 
కేంద్ర ప్రభుత్వ పెద్దలు తాజా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటన చేశారు. దాదాపు 100 రూట్లలో 150 ప్రైవేట్ రైళ్లు తొలి దశలో నడవనున్నాయని సమాచారం. మరో సంవత్సరంలోపు ఈ ప్రైవేట్ రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు పెట్టనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 17 రైళ్లు 11 మార్గాల్లో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. 
 
రైల్వే శాఖ మాత్రం ప్రైవేట్ రైళ్లకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయకుండా ఆన్ లైన్ లో ప్రైవేట్ రైళ్ల టికెట్ల విక్రయాలు చేపట్టనుంది. ప్రైవేట్ రైళ్లకు ఆన్ లైన్ లో టికెట్ల విక్రయాలు సక్సెస్ అయితే మాత్రం రైల్వే శాఖ పరిధిలోని అన్ని రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ మరియు సాధారణ టికెట్లు ఆన్ లైన్ లోనే అమ్మకాలు జరిపే అవకాశాలు ఉన్నాయని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. 
 
ప్రస్తుతం ఐఆర్‌సీటీసీలో బెర్త్ లేకపోయినా వెయిటింగ్ లిస్ట్ లో టికెట్ లభిస్తుంది. కానీ ప్రైవేట్ రైళ్లలో మాత్రం బెర్త్ ఉంటే మాత్రమే టికెట్ లభిస్తుంది. ప్రైవేట్ రైళ్లలో ఎన్ని రోజులు ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే అంత తక్కువ ధరకు టికెట్ లభించే అవకాశం ఉండటంతో పాటు ప్రయాణ తేదీ దగ్గర పడే కొద్దీ భారీగా టికెట్ రేటు పెరగనుంది. ప్రైవేట్ రైళ్లలో చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసుకున్నా కట్టిన సొమ్మును నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: