మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ చౌదరి ఇంటిపై

ఇటీ దాడుల అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వరుసగా ఐదు రోజులపాటు రోజూ జరిగిన ఈ దాడుల్లో రూ. 2000 కోట్లకు సంబంధించిన ఆధారాలు దొరికినట్టు వార్తలు వస్తున్నాయి. వరుస దాడుల తర్వాత ఏకంగా రూ. 2000 కోట్ల బండారం బయటపడిందంటూ ఐటీ శాఖే ఓ ప్రకటన చేసింది.

 

అయితే.. ఇంత జరిగినా మాజీ సీఎం చంద్రబాబు మాత్రం దీనిపై స్పందించలేదు. టీడీపీకి చెందిన అనేక మంది నేతలు ఈ దాడులకూ టీడీపీకి ఏంటి సంబంధం అంటూ ప్రెస్ మీట్లు పెట్టారు కానీ.. చంద్రబాబు మాత్రం స్పందించలేదు. సరిగ్గా ఈ విషయాన్నే నిలదీస్తున్నారు వైసీపీ నేతలు.

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పు కాదు..తుప్పని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఐటీ రైడ్స్‌లో చంద్రబాబు బాగోతం బయటపడిందని అన్నారు. రూ.2 వేల కోట్లు చేతులు మారాయని రుజువైంది. తక్షణమే చంద్రబాబు, లోకేష్‌ను అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.

 

ఇప్పుడే తీగ లాగారు..త్వరలోనే డొంక కదులుతుంది. చంద్రబాబు మాజీ పీఎస్‌ను పట్టుకుంటేనే రూ.2 వేల కోట్లు దొరికాయంటే.. చంద్రబాబు, లోకేష్‌ను విచారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో?. అన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు, ఆయన తాబేదారులు దోపిడీకి పాల్పడితే చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం వార్తలు రాయడం లేదని ప్రశ్నించారు.

 

ఇక ప్రతి విషయంలోనూ నీతులు చెప్పే పవన్‌, సీపీఐ రామకృష్ణ.. ఈ ఐటీ దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు అంతే కాదు... చంద్రబాబు విదేశాలు వెళ్లింది లెక్కలు సరిచూసుకోవడానికేనని విమర్శించారు. దొరికిపోయారు కాబట్టే చంద్రబాబు, లోకేష్‌లు నోరు మెదపడం లేదని అంబటి రాంబాబు మండిపడుతున్నారు. చిటికీ మాటికీ ప్రెస్ మీట్లు పెట్టి గంటల తరబడి ప్రసంగించే చంద్రబాబు.. సొంత సెక్రటరీ పై ఐటీ దాడి జరిగి ఇంత దుమారం రేగుతున్నా స్పందించకపోవడం అనుమానస్పదంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: