ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటి వద్దకు చేర్చాలనే ఉద్దేశంతో దాదాపు 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్లను ఇంటర్వ్యూల ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 2019 సంవత్సరం ఆగష్టు నెల 15వ తేదీ నుండి గ్రామ, వార్డ్ వాలంటీర్లు విధుల్లో చేరారు. ప్రభుత్వం మొదట ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీర్ ను నియమించింది. 
 
కానీ తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు కేటాయించిన ఇళ్ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో వాలంటీర్ల పరిధిని 50 ఇళ్ల నుండి 100 ఇళ్లకు, గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ల పరిధిని 50 ఇళ్ల నుండి 75 ఇళ్లకు  విసృతం చేయనుంది. వచ్చే నెల 1వ తేదీ నుండి ఈ నిర్ణయం అమలులోకి రానుందని సమాచారం. ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను విడుదల చేయనుంది. 
 
ప్రస్తుతం గ్రామ, వార్డ్ వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ఇంటింటి సర్వే, ప్రభుత్వ పథకాలను ఇళ్లకు చేరవేయడం వంటి పనులన్నీ చేస్తున్నారు. చాలా మంది గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలలో మొదట ఆసక్తితో చేరినా వివిధ కారణాల వలన ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. వాలంటీర్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతూ ఉండటంతో ప్రభుత్వం వాలంటీర్ల సంఖ్యను బట్టి ఇళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గ్రామ, వార్డ్ వాలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేయటంతో పాటు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తోందని ప్రభుత్వం గౌరవ వేతనాన్ని పెంచితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 నెలల క్రితం గ్రామ, వార్డ్ వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం 5,000 రూపాయల నుండి 8,000 రూపాయలకు పెంచుతోందని వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయకపోవటంతో ఆ వార్తలు నిజం కాదని తేలింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: