హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏ పేరుతో మోసాలు చేస్తున్న ఆంధ్రా రంజీ మాజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును అరెస్ట్ చేశారు. మొదట్లో ఏపీ తరపున రంజీ ట్రోఫీల్లో క్రికెట్ ఆడిన నాగరాజు కెరీర్లో నిలదొక్కుకోలేకపోవడంతో ప్రముఖుల పేర్లు చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతినని చెబుతూ ప్రముఖ వ్యాపారవేత్తలకు కాల్స్ చేసి నాగరాజు మోసాలకు పాల్పడేవాడు. 
 
కేటీఆర్ పీఏనంటూ ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు నాగరాజు తిరుపతి అనే పేరుతో ఫోన్ చేసి "ఏపీకి చెందిన క్రికెటర్ నాగరాజు టీ 20 సన్ రైజర్స్ టీంకు, అండర్ 25 వరల్డ్ కు ఎంపికయ్యాడు. నాగరాజు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. అతడికి స్పాన్సర్ షిప్ అవసరం ఉంది. మీరు అతనికి స్పాన్సర్‌షిప్‌ ఇస్తే క్రికెట్ కిట్ పై సంస్థ లోగోను ప్రదర్శించటంతో పాటు మంత్రి కేటీఆర్ క్రికెట్ కిట్ ను నాగరాజుకు అందజేస్తారు" అని మాయమాటలు చెప్పి నమ్మించాడు. 
 
అతని మాయమాటలు నిజమేనని నమ్మిన సంస్థ ఎండీ అతడు చెప్పిన బ్యాంకు ఖాతాకు 3,00,000 రూపాయలు జమ చేశాడు. ఆ తరువాత సంస్థ ఎండీ విచారణ చేయగా మోసపోయానని ఎండీకి అర్థమైంది. గత నెల 13వ తేదీన సంస్థ ఎండీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని శుక్రవారం రోజు ఉదయం విశాఖపట్నం లో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. 
 
నిన్న నాగరాజును కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో నాగరాజు ఏపీ సీఎం జగన్ పేరుతో, టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో కూడా మోసాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో బ్యాంకు అధికారులను, పలు క్రికెట్ అసోసియేషన్లను నాగరాజు మోసం చేసినట్లు తెలిపారు. గతంలోనే నాగరాజును గుంటూరు, వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ మోసాలకు తెరతీశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: