ఈ మధ్య రాజకీయ నాయకులు ప్రత్యర్ధులపై దూకుడుగా వెళితేనే ఫేమస్ అవుతారనే విషయం బాగా కనిపెట్టినట్లున్నారు. ఏదో నిర్మాణాత్మక విమర్శలు చేస్తే కష్టం, ప్రత్యర్ధిని చెడామడా తిట్టేసి, తొడలు కొట్టి సవాళ్ళు విసిరితేనే హైలైట్ అవ్వగలమని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ లేకుండా ప్రస్తుతం ఏపీలో ఇలాంటి రాజకీయాలే నడుస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్యే ఈ సవాళ్ళు నడుస్తున్నాయి.

 

ఇక మొన్న ఎన్నికల్లో గెలిచే వరకు ఎవరికి పెద్దగా తెలియని తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూడా ఈ మధ్య దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తెనాలి పర్యటన సందర్భంగా శివ చేసిన సవాళ్ళు బాగా హైలైట్ అయ్యాయి.  అయితే శివ దూకుడు గురించి చెప్పుకునే ముందు..ఒకసారి ఆయన రాజకీయ జీవితం గురించి మాట్లాడుకుంటే... శివ కుమార్ తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కూడా పని చేశారు. ఇప్పుడు ఆయన వారసుడుగా శివకుమార్ కూడా వైసీపీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

 

2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి, టీడీపీ అభ్యర్ధి ఆలపాటి రాజా చేతిలో ఓడిపోయారు. అయితే ఓడిన శివకుమార్ ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కష్టపడ్డారు. కాకపోతే 2019 ఎన్నికల ముందు శివకు టికెట్ రావడంపై అనుమానాలు నెలకొన్నాయి. అప్పుడు పీకే చేయించిన సర్వేల్లో శివ‌కుమార్‌ అక్కడ అంత బలమైన అభ్యర్థి కాదన్న రిపోర్టులు కూడా వచ్చాయని తెలిసింది. దీంతో టికెట్ రాదని భావించిన శివ... తన బంధువైన మోహన్ బాబు ద్వారా టికెట్ దక్కేలా చేసుకున్నారని ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. మోహన్ బాబు చెప్పడం వల్లే జగన్, శివకు టికెట్ కేటాయించారని తెలిసింది.

 

ఇక ఆ విధంగా టికెట్ దక్కించుకున్న శివకుమార్, తెనాలిలో భారీ మెజారిటీతోనే గెలిచారు. గెలిచాక నియోజకవర్గంలోనే పనిచేసుకుంటూ ఉన్నారు. అయితే అమరావతి ఇష్యూ రావడం, దానిపైన టీడీపీ ఉద్యమం చేయడం, అదే సమయంలో తెనాలిలో ఉద్యమం చేస్తున్న టీడీపీ నేత ఆలపాటి రాజా శిబిరంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో, చంద్రబాబు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. తెనాలికి వెళ్ళి అక్కడ భారీ సభ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో చంద్రబాబుని తెనాలిలో అడుగుపెట్టనివ్వనని శివ ఛాలెంజ్ చేసి, తొడగొట్టారు.

 

అయితే చంద్రబాబు తెనాలి వచ్చారు. సభ జరిగింది. దీని తర్వాత మళ్ళీ శివ స్పందించి, చంద్రబాబుని నానా బూతులు తిట్టేసి హడావిడి చేశారు. ఇక ఈ ఎపిసోడ్ తర్వాతనే శివ బాగా హైలైట్ అయ్యారు. ఈయనలో ఇంత దూకుడు ఉందని జనాలకు అర్ధమైంది. మరి ఇదే దూకుడు ఆయనకు భవిష్యత్‌లో కలిసొస్తుందో లేదో చూడాలి?

మరింత సమాచారం తెలుసుకోండి: