ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా 100 మంది అమ్మాయిలను ప్రకాశం జిల్లా యువకుడు ట్రాప్ చేశాడు. యువకుడు ఫేస్ బుక్ ద్వారా అపరిచిత యువతులతో పరిచయం పెంచుకుని ఆ తరువాత వారి వ్యక్తిగత సమాచారంతో పాటు మాయ మాటలు చెప్పి యువతుల నగ్న చిత్రాలను సేకరించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఒక యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేధింపులకు పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేశారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం కలవళ్లకు చెందిన 25 సంవత్సరాల వయస్సు గల నరేష్ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫేస్ బుక్ లో అపరిచిత యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకోవడంతో పాటు ఫేస్ బుక్ నుండి యువతుల ఫోన్ నంబర్లు సేకరించి యువతుల వాట్సాప్ కు కూడా సందేశాలు పెట్టి పరిచయం పెంచుకునేవాడు. 
 
ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో పరిచయం పెంచుకున్న యువతులతో తాను బంగారం వ్యాపారం చేస్తానని చెప్పటంతో పాటు ఫోటోలు పంపి యువతులు నమ్మేలా చేసేవాడు. ఆ తరువాత యువతులతో పరిచయం పెంచుకొని తనకు న్యూడ్ ఫోటోలు పంపితే బంగారు నగలు ఇస్తానని చెప్పి నమ్మించేవాడు. న్యూడ్ ఫోటోలు పంపిన యువతులకు నగలు ఇవ్వకపోగా లైంగిక కోరికలు తీర్చాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు. 
 
తను చెప్పిన విధంగా చేయకపోతే సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తానని యువతులను బెదిరించేవాడు. ప్రకాశం జిల్లాకు చెందిన యువతిపై కూడా ఇదే విధంగా వేధింపులకు పాల్పడటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నరేష్ మొబైల్ నంబర్ ఆధారంగా అతడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. పోలీసులు నిందితుడు నరేష్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు సోషల్ మీడియాలో పరిచయమయ్యే అపరిచితుల విషయంలో యువతులు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: