ప్రత్యేక నైపుణ్యాలు, విద్యార్హతలు, జీతం, వృత్తి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పాయింట్స్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బ్రిటన్ రూపొందించింది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. తాజా మార్పుల వల్ల ఐరోపా, ఐరోపాయేతర పౌరులను సమానంగా చూస్తారు. ఇప్పటివరకు జారీ చేసిన టైర్ 2 వీసాలపై పరిమితి ఉంది. ప్రస్తుతం అమల్లోకి రానున్న వీసా సంఖ్యపై మాత్రం పరిమితి ఉండదు. అంతేకాదు, బ్రెగ్జిట్ వల్ల ఐరోపా, బ్రిటన్ మధ్య ఏర్పడిన సూన్యతను ఈ విధానం భర్తీ చేస్తుంది. వీసా అవసరమే లేకుండా అపరిమిత సంఖ్యలో ఐరోపా పౌరులు బ్రిటన్‌లో నివసించడానికి, పని చేయడానికి వీలు కల్పిస్తుంది.

 

బ్రిటన్ వీసా నిబంధనల్లో మార్పులతో వచ్చే ఏడాది నుంచి వేలాది భారతీయులకు అక్కడ శాశ్వత ఉద్యోగాలు లభించనున్నాయి. గత 50 ఏళ్లుగా ఉన్న ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో బ్రిటన్ మార్పులు చేపట్టింది. వీసా వ్యవస్థలో మార్పుల వల్ల భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన విదేశీయులను పెద్ద ఎత్తున బ్రిటన్‌లో రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ విధానంలో ఆస్ట్రేలియాను స్ఫూర్తిగా తీసుకున్న బ్రిటన్ రూపొందించిన కొత్త నిబంధనలు 2021 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

 

 

కొత్త వీసా విధానాన్ని ప్రారంభించిన అనంతరం హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ మాట్లాడుతూ.. ఇది బ్రిటన్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని వెలుగులోకి తెస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించి, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసి, మా సామర్థ్యాన్ని పెంచుకుంటామని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విధానం వల్ల నైపుణ్యం లేనివారు బ్రిటన్‌లోకి రావడానికి అవకాశం ఉండదు. బ్రిటన్‌లో ప్రస్తుతం ఉన్న విధానం 70 శాతం నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరాలను తీర్చదని హోం శాఖ పేర్కొంది. ప్రజల ఆసక్తి, ప్రాధాన్యతలకు అనుగుణంగా పాయింట్స్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను రూపొందించామని, దీని వల్ల వలసల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుందని ప్రీతి పటేల్ అన్నారు.

 

 

భారతీయుల సహా ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన వ్యక్తులు తమ నిబంధనల్లో 70 పాయింట్స్‌ను తప్పనిసరిగా ఉండాలని, అలాంటి వారికే యూకేలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఏడాదికి 25,600 పౌండ్ల వేతనంతో ఉద్యోగం పొందాలంటే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటం, విద్యార్హతలు లేదా దానికి సమానమైన అర్హతలు తప్పనిసరి. ప్రస్తుతం టైర్ 2 వీసా పథకం ప్రకారం నైపుణ్యం కలిగిన కార్మికులకు డిగ్రీ ఉంటే 30,000 పౌండ్లు చెల్లిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: