తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు రీజియన్ పరిధిలో డ్రైవర్లకు అధికారులు ఒక వింత నిబంధనను జారీ చేశారు. ఆ నిబంధనను చూసి షాక్ అవ్వడం ఆర్టీసీ డ్రైవర్ల వంతయింది. అధికారులు కేవలం డ్రైవర్లకు మాత్రమే విచిత్రమైన నిబంధనను విధించారు. ఈ నిబంధన గురించి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. అధికారులు ఆర్టీసీ బస్ డ్రైవర్లు పక్కనే ఉన్న సీట్లలో కూర్చున్న మహిళలతో మాట్లాడకూడదని నిబంధన విధించారు. 
 
కోయంబత్తూరు ఆర్టీసీ అధికారులు కొందరు డ్రైవర్లు మహిళలతో మాట్లాడుతూ పరధ్యానంలో బస్సులను నడుపుతున్నారని అందువలనే ఈ రూల్ ను అమలులోకి తెచ్చామని చెబుతున్నారు. కొందరు డ్రైవర్లు మహిళలతో మాట్లాడుతూ ఏకాగ్రతతో బస్సు నడపకుండా డ్రైవింగ్ చేస్తున్నారని తమకు భారీగా ప్రయాణికుల నుండి ఫిర్యాదులు అందటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. 
 
ఈ నిబంధన అతిక్రమిస్తే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ తరువాత కూడా వారిపై ఫిర్యాదులు అందితే డ్రైవర్లను ఉద్యోగాల నుండి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయని ఆర్టీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ నిబంధన గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
కోయంబత్తూరు రీజియన్ పరిధిలో అధికారులు తీసుకున్న నిర్ణయం వలన ప్రమాదాలు తగ్గితే మాత్రం త్వరలో రాష్ట్రమంతటా ఈ నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ డ్రైవర్లలో కూడా ఈ నిబంధన గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు మాత్రం డ్రైవర్లు డ్రైవింగ్ చేసే సమయంలో ఎవరితో మాట్లాకూడదనేలా నిబంధనలలో మార్పులు చేయాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం డ్రైవర్ పక్క సీట్లలో మహిళలు కూర్చోకుండా నిబంధనలో మార్పు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.                          

మరింత సమాచారం తెలుసుకోండి: