2019 ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకులు తగిలిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో చాలామంది నేతలు వలసలు వెళ్ళిపోయారు. మొదట్లో కొందరు బీజేపీలోకి వెళితే, మరికొందరు వైసీపీలోకి వెళ్లారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. అయితే స్థానిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా నాలుగు నియోజకవర్గాలకు ఇన్-చార్జ్‌లని నియమించారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇటీవల చనిపోవడంతో, ఆయన స్థానంలో బడే రాధాకృష్ణయ్య(చంటి)ని నియమించారు.

 

అటు గుడివాడలో మళ్ళీ రావి వెంకటేశ్వరరావుని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఇక బాపట్లలో వెగ్నేష నరేంద్ర వర్మని, మాచర్లలో కొమ్మారెడ్డి చలమారెడ్డిలని నియమించారు. అయితే గన్నవరంలో మాత్రం ఇన్ చార్జ్‌ని పెట్టలేదు. మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన వల్లభనేని వంశీ....అనూహ్యంగా వైసీపీకి మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. తెలివిగా వైసీపీలో చేరితే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి, వైసీపీకి పరోక్ష మద్ధతు తెలిపారు.

 

ఇక వంశీ వైసీపీ వైపు వెళ్లిపోవడంతో నియోజకవర్గంలో టీడీపీకి అండగా నిలిచే నాయకుడు లేకుండా పోయాడు. అయితే తాజాగా పలు నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్‌లని నియమించిన నేపథ్యంలో, గన్నవరంలో కూడా వంశీకి పోటీగా బలమైన అభ్యర్ధిని నిలబెట్టాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. అధికారికంగా ప్రకటన చేయకపోయిన, విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య, కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధని గన్నవరం ఇన్ చార్జ్‌గా నియమించనున్నారని తెలుస్తోంది.

 

ఎందుకంటే గద్దె ఫ్యామిలీకి గన్నవరంపై పట్టు ఉంది. పైగా అనురాధ సొంత వూరు గన్నవరం నియోజకవర్గ పరిధిలోనే ఉంది. గద్దె రామ్మోహన్ 1994లో ఇక్కడ నుంచి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. అయితే ఈ సీటు కోసం ఎన్‌ఆర్‌ఐ పుట్టగుంట సతీశ్ కూడా ట్రై చేస్తున్నారు. కాకపోతే వంశీతో సతీశ్‌కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో సతీశ్‌కు ఇన్ చార్జ్ పదవి ఇవ్వడం కష్టం. వంశీని ఎదురుకోవాలంటే గద్దె ఫ్యామిలీనే కరెక్ట్. కాబట్టి స్థానిక ఎన్నికల లోపే గద్దె అనురాధని ఇన్ చార్జ్‌గా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: