చంద్రబాబు సర్కారులో కీలక పాత్ర పోషించిన మంత్రి అచ్చెన్నాయుడి అవినీతి గురించి ఒక్కొక్కటిగా విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడి పాత్రపై ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే కేవలం ఈఎస్ఐ స్కామ్ మాత్రమే కాదని.. అచ్చెన్న చాలా విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని కథనాలు వస్తున్నాయి.

 

నీరు చెట్టు పథకం పేరుతో కోట్లు కొల్లగొట్టారని.. తిత్లీ తుఫాన్‌ పరిహారం పంపిణీలోనూ కోట్లకు కోట్లు వెనకేసుకున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఈ రెండింటిలోనూ వందల కోట్ల అవినీతి జరిగిందట. తిత్లీ తుఫాన్‌ సమయంలో గ్రామాల వారీగా కాగితాల్లో పంచేసుకుని పరిహారాన్ని కొట్టేశారట. ఇప్పుడు జగన్ సర్కారు రావడంతో విచారణలో అక్రమాల డొంక కదులుతోందట. అయితే.. తిత్లీ తుఫాను పరిహారాన్ని అప్పనంగా కాజేసిన తెలుగు తమ్ముళ్లు దర్యాప్తులో బయటపడకుండా ఉండేందుకు చాలా ప్లాన్ వేశారట.

 

 

భూముల్లేకపోయినప్పటికీ పరిహారం పొందిన వారు మ్యూటేషన్‌ చేయించి, పట్టాదారు పాసు పస్తకాలను తయారు చేయించారట. కంచిలి, కవిటి మండలాల్లో ఎక్కువగా ఈ రకమైన అక్రమాలు జరిగాయని ఉదాహరణలతో సహా చెబుతున్నారు. ఇక నీరు చెట్టు పనుల్లో రూ.5 లక్షల విలువ కన్నా ఎక్కువగా ఉండే పనుల కాంట్రాక్ట్‌లను తమ అనుయాయులకు నామినేటెడ్‌ పద్ధతిలో కట్టబెట్టేశారట అచ్చెన్నాయుడు.

 

మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన అక్రమాలు, అవినీతి కార్యకలాపాలపై ఆధారాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ అందజేస్తున్నామని వైఎస్సార్‌ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌ అన్నారు. ఐదేళ్ల కాలంలో జిల్లాలో గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్‌ రుణాల్లో అక్రమాలు, సింగిల్‌ టెండర్‌ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం జరిగిందన్నారు.

 

మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్‌ టెండర్‌ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్‌ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడంతోపాటు వేలాది కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నాయుడు ఈ రోజు నీతివంతుడిలా మాట్లాడాడడం హాస్యాస్పదంగా ఉందని తిలక్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: