ఏపీలో అధికార వైసీపీలో రాజ్యసభ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎన్నిక‌లు జ‌రిగే నాలుగు రాజ్య‌స‌భ స్తానాలు అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డనున్నాయి. అదే టైంలో మండ‌లి ర‌ద్దు అవుతుండ‌డంతో రాజ్య‌స‌భ సీట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. నలుగురు అభ్యర్థులెవరో ప్రకటించేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. పార్టీ కోసం కష్టపడే వారికీ.. అధినేత జగన్‌కు నమ్మినబంట్లుగా ఉన్నవారికే అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంటున్నారు.



ఆశ‌లు ఎలా ఉన్నా.. జ‌గ‌న్ మ‌దిలో ఉన్న ఆ న‌లుగురు ఎవ్వ‌రు అన్న‌ది మాత్రం అంతు ప‌ట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ సైతం ఆ పార్టీ కీల‌క నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయసాయిరెడ్డిని మంగళవారం తాడేపల్లికి పిలిపించి మంతనాలు జరిపారు. ఈ లిస్టులో రాంకీ గ్రూప్ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ముందు వ‌రుస‌లో వినిపిస్తోంది. ఇక బీసీ కోటాలో నెల్లూరు నేత బీద మస్తాన్‌రావుకు పార్టీ మారిన‌ప్పుడే రాజ్యసభ పదవి ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారని అంటున్నారు.



ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఇదే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ సైతం రాజ్య‌సభ సీటుపై ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆ సీనియ‌ర్ నేత ఎవ‌రో కాదు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి. ఒంగోలు, న‌ర‌సారావుపేట నుంచి గ‌తంలో ఎంపీగా గెలిచిన మేక‌పాటి నెల్లూరు నుంచి కూడా వ‌రుస‌గా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే గ‌తేడాది ఎన్నిక‌ల్లో ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి కోసం జ‌గ‌న్ మేక‌పాటిని త‌ప్పించారు.

ఇప్పుడు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మేక‌పాటి సైతం త‌న‌కు రాజ్య‌స‌భ సీటుపై జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని చెప్పుకుంటున్నార‌ట‌. అయితే ఇప్ప‌టికే మేక‌పాటిని జ‌గ‌న్ పూర్తిగా ప‌క్క‌న పెట్టేశార‌ని.. గత ఎన్నిక‌ల‌కు ముందు నుంచే మేక‌పాటి విష‌యంలో జ‌గ‌న్ తీవ్ర అసంతృప్తితో ఉండేవార‌ని... ఇటు మేక‌పాటి సైతం జ‌గ‌న్ విష‌యంలో అస‌హ‌నంతో ఉండేవార‌న్న టాక్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు మేక‌పాటి త‌న‌యుడు గౌతంరెడ్డికి సైతం జ‌గ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో  వైసీపీలో ఆయ‌న శ‌కం దాదాపు ముగిసిన‌ట్టే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: