ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. వాస్తవానికి అమరావతి అనేది ఓ చిన్న పట్టణం. కానీ ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి అన్నది ఆ చిన్నపట్టణం కాదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని మండలాలను అమరావతి నగరంగా ప్రకటించారు. పేరుకు ప్రకటించారు కానీ ఇప్పుడు అక్కడ నగరం లేదు. 29 గ్రామాలు, కొన్నిచోట్ల బహుళ అంతస్తుల భవనాలు మాత్రమే ఉన్నాయి. ఐదేళ్లు సీఎంగా ఉన్నా చంద్రబాబు అమరావతిలో కనీసం 20 శాతం భవనాలైనా కట్టలేదని వైసీపీ ఆరోపిస్తుంటింది.

 

 

అయితే రాజధానిని అమరావతి నుంచి జగన్ విశాఖ తరలించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రాజధాని పేరును కూడా మార్చేస్తున్నారు. అయితే అది అధికారికం కాదు లెండి. ఏపీ రాజధాని అమరావతి పేరును వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే 'బహుజన అమరావతి'గా మార్చారు. ఇకపై అమరావతిని ఇలాగే పిలవాలని సూచించారు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో సుమారు 55 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 1251 ఎకరాలు కేటాయించింది.

 

 

సీఆర్‌డీఏ చట్టం ప్రకారం సుమారు 2600 ఎకరాలు 5 శాతం ఆర్థికంగా వెనుకబడి పేదల కోసం కేటాయించాలి. ఆ చట్టానికి లోబడి సీఎం వైయస్‌ జగన్‌ పేదల కోసం 1251 ఎకరాలు కేటాయించారు. అయితే రాజధాని భూములను పట్టాలుగా పంచుతున్నారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు తీరుపై సెటైర్లు వేశారు.

 

 

జగన్ నిర్ణయంతో అమరావతి కాస్తా 'బహుజన అమరావతి' అవుతుందన్నారు. ఆ తర్వాత అది 'సర్వజన అమరావతి' కూడా అవుతుందని కామెంట్ చేశారు. ఇకపై అమరావతి అందరి రాజధానిగా మారబోతోందని, అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాల్లోని 54 వేల మంది పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించబోతున్నామని ఆర్కే వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: