విశాఖ పర్యటనలో ఎదురైన చేదు అనుభవం టీడీపీకి సవాల్ గా మారింది. మళ్లీ ఎలాగైనా విశాఖ వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా ఇంకా టీడీపీ నేతలు ఇదే విషయంపై ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు సాగిస్తున్నారు. ఇక చంద్రబాబు కుమారుడు లోకేశ్ అయితే వైసీపీ తీరుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

 

 

ప్రస్తుతం విశాఖలో వైసీపీ ట్రైలర్ మాత్రమే చూపిందని.. ముందు ముందు సినిమా చాలా దారుణంగా ఉంటుందని ప్రజలను హెచ్చరించారు. అయితే లోకేశ్ విమర్శలపై వైసీపీ ఎదురు దాడి చేస్తోంది. మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేశ్ తీరుపై ఘాటుగా స్పందించారు. ‘చంద్రబాబు పులివెందుల రౌడీలు వచ్చారని గోబెల్స్‌ ప్రచారం చేయిస్తున్నాడు. పోలీసుల గురించి చాలా చులకనగా చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడారు. టీడీపీ హయాంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు కూడా పని చేస్తున్నారన్నారు మంత్రి అవంతి.

 

 

శాంతిభద్రతలకు పాటుపడే పోలీసుల గురించి చులకన మాట్లాడడం మంచిది కాదు. నిన్న పోలీసులు లేకుండా చంద్రబాబు క్షేమంగా హైదరాబాద్‌ వెళ్లగలిగేవాడా..? పోలీసులు చంద్రబాబు చాలా భద్రత కల్పించారు. ఆరు గంటలు ప్రజలు కడుపు మంటతో ధర్నా చేశారంటే ప్రజల ఆగ్రహం ఏ విధంగా ఉందో చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా గుర్తించాలి.. అంటూ మండిపడ్డారు మంత్రి అవంతి.

 

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ పులివెందుల గుండాలు, రౌడీలు వచ్చారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇంటికి వెళ్లి తంతామని లోకేష్‌ మాట్లాడుతున్నాడు. ఎవరి ఇంటికి వెళ్లి తంతాడో లోకేష్‌ను రమ్మనండి. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. లోకేష్‌ను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. ప్రజల వారి అసంతృప్తిని, అసహనాన్ని రకరకాలుగా వ్యక్త పరుస్తుంటారు. దానిపై సమన్వయంతో వ్యవహరించాలి కానీ ప్రాంతాలు, నాయకులు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లోకేష్‌ వ్యవహార శైలి ఉంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ల్యాండ్‌ పూలింగ్‌కు సంబంధించి 1.75 లక్షల మందికి విశాఖపట్నంలో మేము ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనే సుమారు లక్ష మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వమంటారా.. వద్దంటారా..? అంటూ సూటిగా ప్రశ్నించారు మంత్రి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: