ఏపీ సీఎం జగన్ మొదటి నుంచి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఆరోగ్య శ్రీ  అమ్మ ఒడి, నాడు- నేడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడంత ఉంది. కానీ ఈ పథకాలు సజావుగా అమలు చేయాలంటే.. ముందు ఆదాయం సరిగ్గా ఉండాలి. కానీ ఈ విషయంలో గణాంకాలు బేజారెత్తిస్తున్నాయి. 

 

ఓ ప్రముఖ పత్రిక తెలిపిన లెక్కల ప్రకారం.. రాష్ట్ర ఆదాయం అంచనాలు తప్పుతోంది. రెవెన్యూ వసూళ్లు అంచనా వేసిన దాంట్లో సగం కూడా రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర సాయమైతే ఆశించిన దాంట్లో నాలుగో వంతు కూడా దక్కడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు ఆశించిన రెవెన్యూ వసూళ్లలో రాష్ట్రానికి సగం కూడా దక్కలేదు. 

 

 

కేంద్ర సాయంపైనా అంచనాలు తప్పాయి. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. కేంద్రం నుంచి ఆశించిన దాంట్లో నాలుగో వంతు కూడా దక్కట్లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 61 వేల 71 కోట్లు వస్తాయనుకుంటే జనవరి నెలాఖరు వరకు దక్కింది 13వేల 558 కోట్లే. ఆశించిన మొత్తంలో ఇది కేవలం 22 శాతం. బడ్జెట్‌ అంచనాల్లో మొత్తం వసూళ్లు 2లక్షల 14వేల 558 కోట్లుగా లెక్కిస్తే.. జనవరి నెలాఖరుకు వచ్చిన మొత్తం లక్షా 33వేల 339 కోట్లే వచ్చాయి. అంటే, 62.15% మాత్రమే. 

 

ఈ ఏడాదిలో లక్షా 78వేల 697 కోట్లు వస్తుందని అంచనా వేస్తే.. జనవరి నెలాఖరుకు  85వేల 987 కోట్లే ఆదాయం వచ్చింది. అంచనాతో పోలిస్తే ఇది 48.12% మాత్రమే. అంటే సగం కూడా లేదన్న మాట. మరి పరిస్థితి ఇలా ఉంటే.. జగన్ సర్కారు ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తుందన్నది అర్థం కాని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: