ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీలో కుదురు క‌నిపించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అత్యంత కీల‌క‌మైన త‌రుణంలో పార్టీలో నేత‌ల మ‌ధ్య చోటు చేసుకుంటున్న ర‌గ‌డ.. భారీ ఎత్తున పార్టీ ప‌రువును తీస్తున్న‌దంటూ.. విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ముఖ్యంగా ఆ జిల్లాజిల్లా అనే సంబంధం లేకుండా ప్ర‌తి జిల్లాలోనూ కొత్త నేత‌లు వ‌ర్సెస్ పాత నేత‌ల మ‌ధ్య పోరు తీవ్రంగా సాగుతోంది. ముఖ్యంగా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో కొంద‌రు కొత్త నేత‌ల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వ‌డం వారు గెలుపొంద‌డం తో ఇదంతా కూడా త‌మ విజ‌య‌మేన‌ని వారు భావిస్తున్నారు. అంతేకాదు, త‌మ‌కు ఇక తిరుగులేద‌ని అనుకుంటున్నారు.  



ఇక‌, మ‌రికొన్ని చోట్ల జూనియ‌ర్ల‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం కూడా పార్టీలో తీవ్ర కుమ్ములాట‌ల‌కు కార‌ణం అయింద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో పార్టీ కోసం ప‌నిచేసిన వారిలో కొంద‌రిని ప‌క్క‌న పెట్టి మ‌రో కీల‌క ప‌ద‌వి ఇస్తాన‌న్న జ‌గ‌న్ వారి విష‌యాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మూ కొత్త‌వారికి, జూనియ‌ర్ నేత‌ల‌కు కూడా అందివ‌చ్చిన అవ‌కాశంగా క‌లిసి వ‌చ్చింది. దీంతో వారు త‌మ‌దైన శైలిలో విజృంభిస్తున్నారు. ఈ కుమ్ములాట‌ల‌తో పార్టీ ప‌రువును బ‌జారున ప‌డేస్తున్నారు. క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలోను, నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అక్క‌డ గెలిచిన ఎమ్మెల్యేల‌ను కింది స్థాయి నాయ‌కులు లెక్క చేయ‌డం లేదు. మీరెంతో మేమూ అంతే అనే మాట నుంచి మేమే ఎక్కువ అనే స్థాయికి ఇక్క‌డ రాజ‌కీయాలు మారిపోయాయి.



ఇక‌, గుంటూరు జిల్లా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొంది. చిల‌క‌లూరిపేట‌, తాడికొండ‌ల్లో గెలిచిన ఎమ్మె ల్యేలు స‌ర్వంతామే అని భావిస్తున్నారు. త‌మ‌కు అవ‌కాశం ఇచ్చిన వారికి క‌నీసం మొహం కూడా చూపించ‌డం లేదు. దీంతో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. త‌మ మాటే చెల్లుబాటు కావాల‌ని భావిస్తున్నారు. దీంతో సీనియ‌ర్ల‌కు, జూనియ‌ర్ల‌కు మ‌ధ్య ఈ జిల్లాలో మ‌రింత ర‌గ‌డ చోటు చేసుకుంది. ప‌శ్చిమ గోదావ‌రిలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ఓ మంత్రి ఏకంగా రెండు నుంచి మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న ఆధిప‌త్యం చూపిస్తున్నారు. తూర్పులో నువ్వా-నేనా అనే ప‌రిసస్థితి నెల‌కొంది. పార్టీని ముందు నుంచి ఆదుకున్న నాయ‌కుల‌కు, ఇటీవ‌ల కాలంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న నేత‌ల‌కు మ‌ధ్య వివాదాలు న‌డుస్తున్నాయి.



ఇక‌, విజ‌య‌న‌గ‌రంలో సీనియ‌ర్ల‌కు-సీనియ‌ర్ల‌కు మ‌ధ్యే కుద‌ర‌డం లేదు. దీంతో అస‌లు పార్టీకి ఏమైంది? త‌్వ‌ర‌లోనే స్థానిక ఎన్నిక‌లు ఉన్నాయి. అప్ప‌టికి అంద‌రూ క‌లిసి ప్ర‌చారం చేయాల్సిన బాధ్య‌త ఉంటుంది. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆ త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా జ‌గ‌న్ స్పందించి కాయ‌క‌ల్ప చికిత్స చేస్తారా?  లేదా?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: