ఇటీవల విశాఖలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన జరిగింది అది అందరికీ విదితమే.. అయితే..ఈ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనల పై కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా.. దాఖలైన పిటిషన్ల పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. 
 
 
టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్ పిటిషన్‌ పై లాయర్లు తమ వాదనలు వినిపించారు. సీఆర్పీసీ 151 ప్రకారం నోటీసులను ఇవ్వడాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది తప్పు బట్టగా.. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తికి ఏజీ తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నవి అసలు చట్ట పరిధిలోకి ఆయన రావన్నారు.
 
 
హైకోర్టు.. 151 సీఆర్పీసీ ఏ విధంగా అమలు చేస్తారో డీజీపీ స్వయంగా వివరించాలని సూచించింది. మార్చి 12న డీజీపీ కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఎయిర్‌ పోర్ట్ దగ్గరకు వచ్చిన వారిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని కోర్టు పోలీసుల్ని ప్రశ్నించింది. ఇప్పటికే విశాఖ ఘటన పై డీజీపీ, విశాఖ కమిషనర్‌ లు కౌంటర్లు దాఖలు చేశారు. పిటిషన్ల పై తదుపరి విచారణను ఈ నెల 12కు 
హైకోర్టు వాయిదా వేసింది.
 
చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉద్రిక్తతల సంగతి తెలిసిందే. చంద్రబాబు విజయనగరంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు వెళ్లగా.. విశాఖ ఎయిర్‌ పోర్టులో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. చంద్రబాబు కాన్వాయ్ కదలకుండా అడ్డగించారు.. దాదాపు నాలుగైదు గంటల పాటూ అక్కడ హైడ్రామా నడిచింది. చివరికి పోలీసులు 151 కింది నోటీసులు ఇచ్చి చంద్రబాబును వెనక్కి పంపారు. ఆయన కూడా విశాఖ నుంచి బయల్దేరి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ ఘటన పై మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈ విషయమై విచారణ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: