ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న జగన్ తాజాగా మరో హామీ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు నెలల క్రితం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రకటించిన జగన్ ఈ నెల నుంచి ఈ పథకం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏటా 15 వేల రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు 75 వేల రూపాయలను కాపు మహిళలకు ఆర్థిక సాయంగా అందించనుంది. 
 
ఈ పథకం కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు వర్తించనుంది. ప్రభుత్వం వెనుకబడిన మహిళల జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. ప్రభుత్వం ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2.29 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. 1101 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ పథకం కోసం విడుదల చేసింది.


45 - 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కాపు, ఒంటరి, తెలగ, బలిజ కులాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ధరఖాస్తు కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. ఇంట్లో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉంటే ఆ కుటుంబంలోని మహిళలు ఈ పథకానికి అర్హులు కాదు. మూడెకరాల లోపు మాగాణి, పదెకరాల లోపు మెట్టభూమి ఉన్నా ఈ పథకానికి అర్హులు. 
 
ప్రభుత్వం 2020 మార్చి నుండి 2024 మార్చి వరకు ఐదేళ్ల పాటు సాయం అందించనుంది. ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా అభ్యర్థుల సమాచారాన్ని సేకరించి గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది. అతి త్వరలో అర్హుల ఖాతాలో నగదు జమవుతుంది. నగదు జమ అయిన తరువాత ఖాతాదారుల ఫోన్ కు మెసేజ్ వస్తుంది. వైయస్సార్ కాపు నేస్తం పథకం అమలు దిశగా జగన్ చర్యలు చేపట్టటంపై కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: