సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయం కూడా తన ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ చెబుతుంటారు. అందుకే అనేక పదవుల్లో బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తుంటారు. చివరు ఆలయాల కమిటీల విషయంలోనూ జగన్ 50 శాతం బీసీలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గతంలోనే జీవో తెచ్చారు.

 

 

కానీ ఇప్పుడు జగన్ దూకుడుకు ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 రిజర్వేషన్లు కల్పించే జీవో 176 పైనా... బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించే ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్ల అమలుపైనా బి.ప్రతాప్‌రెడ్డితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ఈ రిజర్వేషన‌్ల అమలకు కోర్టు బ్రేక్ వేసింది. ఇలా రిజర్వేషన్లకు వీలు కల్పిస్తున్న ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్లు 9(1), 15(2), 152(1), 153(2), 180(1), 181(2బీ) చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.

 

 

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. 50 శాతానికి మించి కోటా ఇవ్వడం సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకమని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్సీ లకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మొత్తం రిజర్వేషన్లను 59.85 శాతంగా పేర్కొంటూ జగన్ ప్రభుత్వం 2019 డిసెంబరు 28న ఓ జీవో జారీ చేసింది. ఈ రిజర్వేషన్లను 50 శాతానికి లోబడి తిరిగి నిర్ణయించేందుకు జగన్ ప్రభుత్వానికి నెల రోజుల సమయమిస్తూ తీర్పు చెప్పింది.

 

 

బీసీ జనాభాపై సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించకుండా ఊహాజనితంగా 34శాతం రిజర్వేషన్లను కల్పించడం సరికాదని పిటిషనర్లు వాదించారు. అయితే మొదట ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించి. పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు హైకోర్టు విచారణ జరిపింది. సోమవారం నిర్ణయాన్ని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: