ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లను విడుదల చేయడానికి డేట్లు ఫిక్స్ చేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 7న విడుదల కానుండగా మార్చి 21న పోలింగ్ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 10న విడుదల కానుండగా మార్చి 24వ తేదీని పోలీంగ్ తేదీగా ప్రభుత్వం నిర్ణయించనట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మార్చి 15న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 27న ఎన్నికలు జరగనున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. 
 
హైకోర్టు తాజా ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు చేస్తోంది. 9.85 శాతం మేర రిజర్వేషన్లు తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. హైకోర్టు ఆదేశాలతో బీసీ రిజర్వేషన్లు 24.15 శాతానికి పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎస్టీ, ఎస్సీలకు యధాతథంగా రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. 
 
హైకోర్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. గత ఏడాది డిసెంబరులో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు రద్దు చేసింది. కోర్టు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో తిరిగి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని కోర్టు ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను ఈ నెల 31 లోపు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 
 
2020 మార్చి 21వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుండి వచ్చే 3200 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయి. అదే జరిగితే నిధుల లేమి ప్రభావం గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులపై పడనుంది. ఏపీలో ఇప్పటికే స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసి ఏడాదిన్నర అవుతోంది. 2018 - 2020 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం 4065 కోట్ల రూపాయలు ఏపీకి కేటాయించినా తొలి విడత మాత్రమే మంజూరు చేసింది. రెండో విడత మంజూరు కావాలంటే మార్చి 31లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: