చైనాలోని వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను చుట్టుముడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి 3,100 మంది మృతి చెందారు. 77 దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్ భారత్ లోనూ ప్రవేశించింది. హైదరాబాద్, ఢిల్లీలలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా ఈ సంఖ్య ఆరుకు చేరిందని సమాచారం. దేశంలో మరికొందరికి ఈ వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా ఏపీలో ఒక యువకుడికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దక్షిణ కొరియా నుండి వచ్చిన యువకుడు ఇంటికి వచ్చిన తరువాత అనారోగ్యం పాలవడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు అతన్ని పరిశీలించి కరోనా సోకి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. అనంతరం యువకుడు ఎవరికీ చెప్పకుండా అత్తగారింటికి వెళ్లిపోయాడు. వైద్యులు యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించాయని పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకుని స్థానిక ఆస్పత్రికి పంపారు. వైద్యులు ప్రత్యేక వార్డులో యువకుడికి చికిత్స అందిస్తున్నారు. యువకుడు దక్షిణ కొరియా నుండి వచ్చిన తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. ఆ టెస్టులో అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాలేదు. ఇంటికి వచ్చాక కొన్ని రోజులకు కరోనా సంబంధిత లక్షణాలు కనిపించటంతో యువకుడు ఆస్పత్రికి వెళ్లాడు. 
 
వైద్యులు యువకుడికి కరోనా సోకిందో లేదో నిర్ధారించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆందోళన నెలకొంది. వైద్య నిపుణులు ముందు జాగ్రత్తలు పాటించి ఈ వ్యాధి వ్యాప్తికి చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. కరోనా వైరస్ చికిత్స అందిస్తున్న ఆస్పత్రులకు వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లేవారు ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: